వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్

• నోరుంది కదాని ఇష్టారీతిన మాట్లాడితే మేమూ అనగలం… జగన్ కోడి కత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ అని
• వై నాట్ 175 అంటే 11 సీట్లు వచ్చేసరికి మతిస్థిమితం కోల్పోయారు
• వైసీపీ తాడూ బొంగరం లేని పార్టీ
• ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చేది.. శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదు
• జర్మనీ విధానాన్నే శ్రీ పవన్ కళ్యాణ్ విడమర్చి చెప్పారు
• శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదు
• యువతను నిలువునా మోసం చేసి 44 లక్షల ఉద్యోగాలిచ్చామని కథలు చెబుతున్నాడు
• గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకుండా పోయింది
• కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు 100 శాతం నిలబెట్టుకుంటుంది
• అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్

జగన్మోహన్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి ప్రజాస్వామ్య విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. వై నాట్ 175 కాస్త 11కి పడిపోయి ఆ అక్కసుతో మతిస్థిమితం కోల్పోయారన్నారు. ‘ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలో నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. మేమూ అనగలం… జగన్ కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. ప్రజా జీవితంలో ఉండి – ఒక్క రూపాయి కూడా సాటివారికి ఖర్చు చేయని జగన్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు. అధికారంలో ఉండగా వర్క్ ఫ్రం హోం ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్ ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు శాసన సభ్యుడయ్యారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసమైనా శాసన సభకు వచ్చి మాట్లాడాలి కదా?’ అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తుందని.. మీలా బటన్లు నొక్కామని మోసం చేయదని అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జనసేన పార్టీ శాసన సభ్యులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కావాలి అని డిమాండ్ చేయడం ఎంత హస్యాస్పదమో గౌరవ సభాపతి గారు ప్రజలందరికీ అర్ధం అయ్యే విధంగా తెలియపర్చారు. అయితే జగన్ నోరుంది కదా అని కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ బాధించాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో అదే విషయాన్ని చెప్పారు. మీకు ప్రతిపక్ష హోదా రాదు. అది డిమాండ్ చేసే స్థాయిలో లేరు. మన స్థానం ఏంటో అంతిమంగా నిర్ణయించేది ప్రజలే. ప్రతిపక్ష హోదాను మీరు డిమాండ్ చేయలేరు. ఐదేళ్లు దాని గురించి మర్చిపోండి. శాసన సభకు వచ్చి చర్చల్లో పాల్గొని మీకు ఓట్లు వేసిన ప్రజల సమస్యల మీద మాట్లాడమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. వైసీపీకి 39 శాతం ఓట్ షేర్ వచ్చిందన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఆ సంస్కృతి దేశంలో లేదు. జర్మనీ లాంటి దేశంలో అవకాశం ఉంటుంది కాబట్టి అది కోరుకుంటే జర్మనీకి వెళ్లి పోటీ చేయమని తెలియచెప్పారు. వైసీపీ ఒక తాడూ బొంగరం లేని పార్టీ. ఒక సభ ఏర్పాటు చేసి తనకు తానుగా ఆ పార్టీకి జీవిత కాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని ఖండించింది. చురకలు కూడా వేసింది. జగన్ కనీసం ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి. రూల్స్ పాటించని వ్యక్తి. తన పార్టీకి అధ్యక్షుడు ఎవరో తేల్చుకోలేని పరిస్థితుల్లో జగన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ప్రభుత్వంలో ఒకలా ప్రవర్తించే వ్యక్తి కాదు. జగన్ రెడ్డి పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుంటే వారి కుటుంబాలను ఆదుకునేందుకు స్వయంగా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా సభలు నిర్వహించి ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున సాయం అందించారు. చివరికి నీ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రాంతానికి చెందిన 24మంది రైతులకు కూడా శ్రీ పవన్ కల్యాణ్ గారు అండగా నిలిచారు.
• కూటమి ప్రభుత్వం మీలా బటన్ నొక్కేశామని మోసం చేయడం లేదు
యువత జీవితాలు నాశనం చేసిన జగన్ 44 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నాడు. వాలంటీర్లను వారి సమయం పొడిగించకుండా నిండా ముంచాడు. మార్చిలో జీవో గడువు ముగిస్తే దాన్ని పొడిగించలేదు. ఇప్పుడు వారి సంఖ్య కలిపి 44 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నాడు. అందుకే నిన్నటి రోజున యువత అద్భుతమైన తీర్పు ఇచ్చారు. 70 శాతం ఓటు షేర్ ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు అండగా నిలబడ్డారు. జగన్ ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించిన వ్యక్తి. స్వలాభం కోసం సొంత ఆస్తుల కోసం తండ్రి గారు ఉన్నప్పుడు కూడా అలాగే చేశాడు. సూపర్ సిక్స్ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? సూపర్ సిక్స్ వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడితే దుష్ప్రచారం చేశారు. పత్రికల్లో వార్తలు రాయించి ప్రజల్లో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. 94 లక్షల 32 వేల మందికి ఈ రోజు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాం. మీలా మోసం చేయలేదు. బటన్ నొక్కేశామని మోసం చేయలేదు.
• ధాన్యం బకాయిలు పెట్టి రైతుల్ని దగా చేసి పోయారు
విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. చెప్పే మాటకు కట్టుబడి ఉండాలి. 11కు పడిపోయిన మీరు బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేశారు. ప్రభుత్వం మీద నమ్మకంతో ధాన్యం అమ్మితే రూ. 1674 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ఇది మోసం కాదా? అదే రైతులకు శ్రీ చంద్రబాబు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చి గత ప్రభుత్వం చేసిన బకాయిలు తీర్చాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో భారత దేశంలో ఎక్కడా జరగని విధంగా కార్యక్రమం చేసి రైతాంగాన్ని ఆదుకున్నాం. 33 లక్షల 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్ లో కొనుగోలు చేశాం. నిన్న సాయంత్రం వరకు రూ. 7,770 కోట్ల విలువ చేసే ధాన్యం కొన్నాం. 94.6 శాతం రైతులకు 24 గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేశాం. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా పని చేసిందా? ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత విస్మరించి శాసన సభకు కూడా రాకుండా ఏం సందేశం ఇస్తున్నారు.
• శాశ్వత ముఖ్యమంత్రిగా ఊహించుకుని రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు
ప్రజా సమస్యలపై మాట్లాడాలి అంటే శాసన సభకు వచ్చి మాట్లాడాలి. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తుంటే ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఒక సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్లోనే రూ.41 వేల కోట్ల అప్పులు చేశారు. ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా ఇబ్బందిపెట్టారో ప్రజలంతా చూస్తున్నారు. సూపర్ సిక్స్ లో మేమిచ్చిన హామీలు నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటాం. ప్రభుత్వం నుంచి అందించాల్సిన భరోసా విషయంలో పొరపాటు చేయం. ముఖ్యమంత్రి గారు, ఉపముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతులను కచ్చితంగా ఆదుకుంటాం. తల్లికి వందనం కార్యక్రమం కింద కుటుంబంలో ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికీ రూ. 15 వేల చొప్పున ఇస్తాం. దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేశాం. రోడ్లు వేయండి మహా ప్రభో అని ప్రజలు బతిమలాడితే మీ హయాంలో గుంతలు కూడా పూడ్చలేదు. శాశ్వతంగా ముఖ్యమంత్రి అని తనను తాను ఊహించుకొని రుషికొండ ప్యాలెస్ కి మాత్రం రూ.500 కోట్లు ఖర్చు చేశారు. సముద్ర తీరాన అద్భుతమైన ప్యాలెస్ తయారు చేసుకున్న భ్రమలో చేసిన కార్యక్రమం పర్యాటక రంగానికి నష్టం కలిగించింది. పరిపాలన చేతకాక దద్దమ్మల్లా కూర్చుని రాష్ట్రానికి మీరు చేసిన నష్టం పూడ్చడానికి సమయం పడుతుంది. అర్ధం కాని పరిస్థితుల్లో కూడా కష్టకాలంలో ప్రజలను ఆదుకునే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాం” అన్నారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ, శ్రీమతి లోకం నాగ మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్, పత్సమట్ల ధర్మరాజు, వంశీకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు.

Share this content:

Post Comment