జగనన్న విద్యాదీవెన మొదటి విడతను ప్రారంభించిన సిఎం జగన్‌

అమరావతి: ఎపి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విద్యాదీవెన పథకం మొదటి విడతను సిఎం జగన్‌ సోమవారం ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.671.45 కోట్ల నిధులను సిఎం జగన్‌ విడుదల చేశారు. విద్యాదీవెనలో భాగంగా విద్యార్థులకు తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,88,439 మంది విద్యార్థులు ఈ దఫా లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ.. జగనన్న విద్యాదీవెన గొప్ప కార్యక్రమం అని, చదువుతోనే జీవితాల రూపు రేఖలు మారతాయని అన్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.671 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. 2018-19 సంబంధించి రూ.1880 కోట్లు బకాయిలు చెల్లించామన్నారు. 2019-20కి సంబంధించి రూ.4208 కోట్లు గతేడాది చెల్లించామని గుర్తు చేశారు. పిల్లల చదువులను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని అన్నారు. ప్రతి త్రైమాసికం పూర్తికాగానే నిధులను విడుదల చేస్తామన్నారు. అర్హత ఉండి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోతే విద్యార్థులు 1902కు ఫోన్‌ చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని తెలిపారు. కళాశాల యాజమాన్యాలలోనూ జవాబుదారీ పెరగాలన్నారు. ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా అంగన్వాడీలను అభివఅద్ధి చేస్తున్నామని సిఎం జగన్‌ పేర్కొన్నారు.