జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు: డా.వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిననాటినుంచి నేటివరకు గిరిజనప్రాంతంలో ప్రభుత్వపరంగా పేదలకు ఇళ్ళు మంజూరు సంపూర్ణాంగా చేయకపోవడం చాలా అన్యాయం. అక్కడక్కడ కొన్ని పంచాయితీలలో అడపదడప 10, నుంచి 15, మందిని లబ్ధిదారులుగా గుర్తించి వాళ్ళ స్థలాలకు వాళ్ళకే పట్టాలు కేటాయించారు. అసలు స్థలం లేని లబ్ధిదారులకు ఎటువంటి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి పట్టాలు మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఇల్లు నిర్మాణానికి ఎటువంటి ఆర్ధిక సహాయం చెయ్యలేదు, చేసినవారికి సకాలంలో ఆర్ధిక సహాయం చేయకపోగా విపరీతమైన జాప్యం జరుగుతున్నది. సొంత ఇంటి నిర్మాణం కలగా భావించి పేద ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరికి “జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు”గా మిగిలిందనేది వాస్తవమని చెప్పాలి. కాగా ప్రస్తుతం ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ రాయితితో గృహాలు నిర్మించుకునుటకు స్థలలతో పట్టాలు మంజూరు చేసి లబ్ధిదారులకు న్యాయం చేకూరే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఆడంబర ప్రచారాలు ఆపండి లబ్ధిదారులకు న్యాయం చేయండి ప్రచారాలకే పరిమితమైన మీ విధానాలను మార్చుకోండి. గిరిజన ప్రాంతంలో కొద్దిపాటి అసంపూర్తి గృహనిర్మాణాలను ఈ నెల 12,13,14 తేదీలలో జనసేనపార్టీ ప్రభుత్వ జవాబుదారితనాన్ని ప్రశ్నిస్తూ సామాజిక తనిఖీలు చేపడుతోంది. లబ్ధిదారులకు అండగా ఉంటామని ఈ సందర్బంగా తెలియజేస్తున్నామని డా.వంపూరు గంగులయ్య జనసేనపార్టీ పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ తెలిపారు. ఈ సమావేశంలో పాడేరు మండల జనసేనపార్టీ ఉపాధ్యక్షులు సీసాలి భూపాల్, సాలేబు అశోక్, మాదేలి నాగేశ్వరరావు, గణేష్ వారడ తదితరులు పాల్గొన్నారు.