జనసేన, టిడిపి పొత్తుతో వైసిపి చిత్తు చిత్తు!

  • వైసిపి మంత్రులు, నాయకులు పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు కేటాయుంచే సమయాన్ని ప్రజాపాలనకు వెచ్చించాలి
  • మంత్రులు తమ శాఖల అభివృద్ధిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి
  • రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు గమనించాలి
  • ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక, ఇరిగేషన్, టూరిజం రంగాలలో సాధించిన అభివృద్ధి గూర్చి ప్రజలకు చెప్పాలి
  • టిడిపి నాయకుల నిరసన దీక్షలు మద్దతు తెలిపిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజవర్గం: జనసేన, టిడిపి పొత్తుతో రాష్ట్రంలో వైసిపి చిత్తు చిత్తవుతుందని జనసేన పార్టీ నాయకులు జ్యోష్యం చెప్పారు. శుక్రవారం పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టే నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, పైల శ్రీనివాసరావు, పసుపురెడ్డి ప్రసాద్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల శ్రేయస్సును కాంక్షించి గురువారం టిడిపితో పొత్తును స్పష్టం చేశారన్నారు. దీంతో రాష్ట్రంలో వైసిపి చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ముఖ్యంగా గౌరవ మంత్రి పదవులను అనుభవిస్తున్న కొందరు మంత్రులు తమ శాఖ అభివృద్ధిపై దృష్టి సారించకుండా.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించేందుకు అధిక సమయం కేటాయిస్తున్నారన్నారు. ఆ సమయం వారి శాఖల పాలనపై పెడితే ఎంతో అభివృద్ధి సాధించటం జరుగుతుందన్నారు. సమర్థతలేని వ్యక్తుల చేతుల్లోకి మంత్రి పదవులు వెళ్లడంతో ఆయా శాఖల్లో అభివృద్ధి సాధించలేకపోవడంతో ముఖ్యమంత్రి దగ్గర మార్కుల కోసం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దిగజారి దూషిస్తున్నారన్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. మంత్రులందరూ తమ శాఖల అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక, ఇరిగేషన్, టూరిజం రంగాలలో ఆయా శాఖల మంత్రులు సాధించిన ప్రగతి గూర్చి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వైసిపి పాలనపై విసిగి వేసారి పోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనసేన టిడిపి పొత్తు.. వైసిపిని చిత్తుచిత్తుగా ఓడిస్తుందన్నారు. కొందరు వైసీపీ నాయకులు మంత్రులు కన్ను మిన్ను కానక నోరు పారేసుకుంటున్నారని అన్నివేళలా కాలం ఒకలా ఉండదని ఇది గమనించి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. వైసిపి నాయకులకు, మంత్రులకు జనసేన టిడిపి కలవటం అనేది రుచించడం లేదని, వారికి నిద్ర పట్టడం లేదని, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. మరికొద్ది నెలల్లో వైసిపి పతనం తప్పదని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.