ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్ర

ఏలూరు: ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మొద్దు నిద్ర పోతున్నాడని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పోరు బాట కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్ కుమ్మరి రేవులో రెడ్డి అప్పలనాయుడు పర్యటించారు. కుమ్మరి రేవు ప్రజలు రెడ్డి అప్పలనాయుడుకు పూలమాలలు వేసి మంగళ హారతి ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. సమస్యలను రెడ్డి అప్పలనాయుడు వద్ద ప్రజలు ఏకరువు పెట్టారు. కనీస మౌలిక సదుపాయాలు లేవని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం పోలీసుల కేసులు, లాఠీ చార్జీలు, నిర్బంధాలను లెక్కచేయకుండా పేద ప్రజలందరూ కలిసి పోరాడి కుమ్మరి రేవులో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారన్నారు. ఈ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు లేవని, త్రాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని, వీధి దీపాలు లేక చీకట్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కుమ్మరి రేవు ప్రజలను మభ్యపెట్టి ఓట్లను దండుకునే ఎమ్మెల్యే ఆళ్ల నాని సమస్యలను పరిష్కరించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. జనసేన పార్టీని ఆదరించాలని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కుమ్మరి రేవులో సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రజలకు రెడ్డి అప్పలనాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, కుమ్మరి రేవు కమిటీ నాయకులు కాకర్ల శ్రీను, రామిశెట్టి కళ్యాణ్, గొర్రెల శేఖర్, కర్రి సురేష్, టి సాయి బాలాజీ‌, గొల్ల చిన్ని, పోతిరెడ్డి పూర్ణ, బొర్ర హేమ సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.