అవినీతి రహిత రాజకీయాలే జనసేన లక్ష్యం: నేమూరి శంకర్ గౌడ్

తెలంగాణ, తాండూరు, అవినీతి రహిత రాజకీయాలే జనసేన లక్ష్యమని బిజెపి బలపరచిన తాండూరు తాండూరు జనసేన పార్టీ అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని పలు వార్డుల్లో బిజెపి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ళ తరబడి పాలించిన కాంగ్రెస్ పేదల బ్రతుకులు మార్చలేక పోయిందన్నారు. కాంగ్రెస్ నాయకులు పలు రకాల స్కాం లతో దేశాన్ని భ్రష్ఠు పట్టించారన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల అవినీతికి బిఆర్ఎస్ తెర లేపిందన్నారు. కమిషన్ల పేరుతో బిఆర్ఎస్ నాయకులు కోట్లాది నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. నరేంద్ర మోడి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. తాండూరులో నెలకొని ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానన్నారు. తాండూరులో కంది బోర్డు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈసారి ఎన్నికల్లో బిజెపి సహకారంతో ఘన విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ బిజెపి – జనసేన ఉమ్మడి అభ్యర్థి శంకర్ గౌడ్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. బిఅర్ఎస్ పాలనతో ప్రజలు విసిగి పోయారని, వారి మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. సంక్షేమ పథకాలలో అవినీతి పేరుకు పోయిందని, బిఆర్ఎస్ నేతల అనుచరులకే పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. జనాలను కులాల పేరుతో విభజించి సాధ్యం కాని పథకాలతో ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎర వేస్తోందన్నారు. గ్యారంటీ స్కీం లతో కాంగ్రెస్ ఓటర్లను మోసం చేస్తోందన్నారు. బి ఆర్ ఎస్, కాంగ్రెస్ లకు ఈసారి ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలు జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన నాయకులు సుదర్శన్ గౌడ్, భద్రేశ్వర్, రజినీకాంత్, రవి పటేల్, రాము, శివకుమార్, కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్, అంబరీష్, లలిత, సాహు శ్రీలత తదితరులు పాల్గొన్నారు.