చిన్న ఓరంపాడుఘటనలో ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన వినతి పత్రం

  • రాజంపేటలో మెరుగైన వైద్య సేవలు అందించాలి
  • ట్రామా కేర్ కోసం డిమాండ్
  • రాయచోటిలో కలెక్టర్, డిఎంహెచ్ఓ, డిఎంహెచ్ఎస్ లకు వినతి పత్రం అందచేసిన రాజంపేట జనసేన నాయకులు

రాజంపేట: చిన్న ఓరంపాడులో జరగిన ఘోర ప్రమాదంలో ప్రభుత్వ వైఫల్యాలు, రాజంపేటలో మెరుగైన వైద్య సేవలు, ట్రామా కేర్ కోసం డిమాండ్ చేస్తూ సోమవారం రాయచోటిలో కలెక్టర్, డిఎంహెచ్ఓ, డిఎంహెచ్ఎస్ లకు రాజంపేట జనసేన నాయకులు వినతి పత్రం అందచేసారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తిరుపతి నుండి కడప వెళ్లే ఆర్టీసీ బస్సు శనివారం సాయంకాలం ఐదు గంటల సమయంలో చిన్న ఓరంపాడు దగ్గర మద్యం మత్తులో తప్పు దారిలో ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నలారీ. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. 14 మందికి తీవ్ర గాయాలు 26 మందికి స్వల్పంగా గాయాలు అయ్యాయని తెలిసింది. ఈ ఘటనపై స్పందిస్తూ పది లక్షల రూపాయలు చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు తీవ్ర గాయాలైన వారికి, 50 వేల రూపాయలు కొద్దిపాటి గాయాలైన వారికి రాష్ట్రప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రమైన గాయాలైన వారికి ఐదు లక్షలు మరియు స్వల్ప గాయాలైన వారికి లక్ష రూపాయలు, అలాగే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బేస్ చేసుకుని ప్రభుత్వంలో ఒకరికి ఉపాధిని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజంపేట జనసేన పార్టీ తరఫున నుండి డిమాండ్ చేసారు. ప్రమాదం వివరాలలోకి వెళ్తే లారీ డ్రైవర్ తాగిన మత్తులో అతివేగంతో నడుపుతూ హైవేలో ఓవర్టేక్ చేసే క్రమంలో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఘోర ప్రమాదానికి ఎన్ని లెవెల్స్ లో ప్రభుత్వం వైఫల్యం చెందిందో ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నాం. మద్యపాన నిషేధం అనే నినాదంతో వచ్చిన ఈ ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని అమ్మి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఇది మొదటి వైఫల్యం. హైవే పక్కన మద్యం షాపులు బార్లు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పిన కడప హైవే ఎక్కగానే ఒక వైన్ షాప్ ఒక బార్, మాధవరం ఒంటిమిట్ట దగ్గర మద్యం షాపులు ఏర్పాటు చేయడం, తిరుపతి కడప రహదారిలో ఎన్నో ఆక్సిడెంట్లు జరుగుతు ఉన్నా మద్యం మత్తులో అతివేగంగా హైవేలో నడుపుతున్న వారిని గుర్తించలేక పోవటం హైవే పెట్రోలింగ్ వారు వైఫల్యం చెందారు. పెట్రోలింగ్ దాదాపు లేనట్టే.. స్పీడ్ డిటెక్షన్ మీటర్లు కూడా బ్రీత్ అనలైసర్లు 24/7 హైవేలో లేవు. యాక్సిడెంట్ జరిగి రాజంపేట ట్రామా సెంటర్ కు క్షతగాత్రులను తీసుకొస్తే సరైన వైద్య సదుపాయాలు లేక 14 మందిని తిరుపతి స్విమ్స్ కి రేఫర్ చేశారు. దాదాపు పది సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ట్రామా కేర్ కు కావలసిన పూర్తి పరికరాలు, సిబ్బంది ఆసుపత్రిలో లేకపోవడం వైద్య సదుపాయాలలో వైఫల్యం చెందడం. కనీసం ఫస్ట్ అయిడ్ కిట్స్ లేక పేషంట్ తరపు బంధువులే వెళ్లి బ్యాండేజ్ తీసుకొని వస్తే పార్సిల్ చేసే అట్టలను పెట్టి గుడ్డలతో కట్లు కట్టారు. రాజంపేట ట్రామా కేర్ సెంటర్లో అవసరమైన వైద్య సిబ్బంది కొరత వల్ల వేరే ప్రాంతాలకు తీసుకెళ్లే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్న వందలాదిమంది అమాయక ప్రజలు. పట్టించుకోని వైద్య శాఖ. రాజకీయ కారణాల దృష్ట్యా హాస్పిటల్ ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. యాక్సిడెంట్ అయిన క్షతగాత్రులకు కనీస రక్త అవసరాలను తీర్చే బ్లడ్ బ్యాంక్ కూడా అందుబాటులో లేకపోవడం మరో వైఫల్యం. ట్రామాకేర్ కు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకోలేక వైద్య సదుపాయాలను, సిబ్బంది, అవసరమైన మందుల ను ఏర్పరచడంలో వైఫల్యం. ట్రామాకేర్ కు అవసరమైన ఆపరేషన్ థియేటర్, ఐ సి యూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, బ్లడ్ బ్యాంక్, అనస్థీషియన్, ఆర్థోపెడిషన్స్, వైద్య పరికరాలు మరియు వైద్య సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సమకూర్చే ప్రక్రియలో వైఫల్యం. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి మరిన్ని అంబులెన్సులను ఏర్పాటు చేయటంలో వైఫల్యం. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స చేసుకుంటే అక్కడి నుండి ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ల నిరాకరణ. ప్రతి నెల 30 నుండి 40 మంది ఆక్సిడెంట్లతో ట్రామా కేర్ కి వస్తూ ఉన్నా సదుపాయాలు, సిబ్బంది లేక వేరే ఊర్లకి తరలిస్తున్న క్రమంలో కోల్పోతున్న ప్రాణాలు, ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం. రోగం రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనుకున్న నాగరిక సమాజంలో అత్యాధునిక సాంకేతికతతో చంద్రమండలంలోకి అడుగుపెట్టిన మానవుడు మేధస్సు ఉన్న ఈ దేశంలో పక్క ఊరికి వెళ్లి తిరిగి వస్తారో రారో అన్న పరిస్థితికి కారణాలు అన్వేషించి తగిన చర్యలు తీసుకోవాలి.. తిరుపతి కడప హైవేలో జరుగుతున్న ప్రమాదాలతో ఈ ప్రభుత్వానికి, ఆరోగ్యశాఖకు కనువిప్పు కలిగి ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ తీసుకొస్తామన్న ఈ వైసీపీ ప్రభుత్వానికి అత్యవసర వైద్య సదుపాయాలను సత్వరమే యుద్ధ ప్రాతిపదికన ఏర్పటుచేయలని రాజంపేట నియోజకవర్గం నుండి కొన్ని సూచనలు చేస్తున్నాం. హైవే పెట్రోలింగ్ 24/7 అన్ని చెక్పోస్టుల దగ్గర అవసరమైన చోట్ల స్పీడ్ చెక్కర్లను, బ్రీత్ అనలైసర్ లను ఏర్పాటు చేయాలి. రాజంపేట ట్రామా కేర్ సెంటర్ లో పరిపూర్ణంగా వాడుకునే రీతిలో ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, బ్లడ్ బ్యాంక్, వైద్య సిబ్బందిజ్ వైద్య పరికరాలు, ఫస్ట్ ఏఐడ్ కిట్స్ , మరిన్ని అంబులెన్స్ లు అవసరమైన మందులను ఏర్పాటు చేయాలి. రాజంపేట ఏరియా హాస్పిటల్ ను జిల్లా హాస్పిటల్ గా వెంటనే గుర్తించి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. హైవే పక్కన బార్, లిక్కర్ షాపుల లైసెన్స్ రద్దు చెయ్యాలి. హైవే లో పెట్రోలింగ్ వ్యవస్థ ను మెరుగుపరచాలి. రాజంపేటలో ఎంపీ కి ఎమ్మెల్యే కి, ఎమ్మెల్యే కి మరియు మరో వైసీపీ నాయకునికి మధ్య విభేదాలు వల్ల వైద్య సదుపాయాల కల్పనలో ఆలస్యం జరుగుతోందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా వైద్య శాఖ మరియు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వస్తున్నాం. దయచేసి యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి జనసేన పార్టీ తరపు నుండి విన్నవించుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వానికి సవాలు.. పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని ప్రశ్నించిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి గారికి , వైసిపి నాయకత్వానికి, ఎంపీ మిధున్ రెడ్డి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని గారికి మద్యపానం నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చి హైవేలో మద్యం షాపులను బార్ లను తీసేసి ప్రోమో కేర్ సెంటర్ ను సంపూర్ణ స్థాయిలో అందుబాటులోకి తీసుకొని రావటంతో పాటు, ఏరియా హాస్పిటల్ గా ఉన్న రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే జిల్లా హాస్పిటల్ గా గుర్తించడానికి తగిన చర్యలు తీసుకొని వైద్య సదుపాయాలను పేదలకి అందుబాటులోకి తీసుకొచ్చి వచ్చే ఎలక్షన్లలో ఓట్లు అడగాలని రాజంపేట జనసేన నాయకులు సవాల్ విసిరారు. అన్ని అర్హతలు ఉన్న రాజంపేట జిల్లా కేంద్రంగా కాకుండా మెడికల్ కాలేజీని కూడా కోల్పోయి కనీస ఆరోగ్య వసతులన్నీ ఏర్పాటు చేయలేకపోతున్నారు. జనసేన పార్టీ డిమాండ్లను తీర్చని పక్షంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని రాజంపేట జనసేన పార్టీ నాయకులు మీడియా సమక్షంలో ప్రభుత్వానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు బాల సాయి కృష్ణ, ఓబులేసు జిగిలి, షేక్ సలీం, రామ శ్రీనివాసులు, వీరమహిళలు రెడ్డి, ఎన్ రాణి, పీ రూప మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.