జనసైనికుల సభ

నెల్లూరు, ఇటీవల పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా నెల్లూరులో జానీ మాస్టర్ ని జనసైనికులకు పరిచయం చేస్తూ జనసైనికుల సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ , జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కిషోర్ గునుకుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేములపాటి అజయ్ మాట్లాడుతూ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అలాగే మొత్తం భారతదేశంలోనే ఒక పెద్ద కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ మన నెల్లూరు బిడ్డ అయినందుకు చాలా గర్వంగా ఉందని, ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి, ప్రజలకు సేవ చేయాలనే మంచి దృక్పథంతో జనసేన పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉందని చెబుతూ జానీ మాస్టర్ ని జనసైనికులకు పరిచయం చేసారు. అలాగే తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు అందరం సమిష్టిగా అధిష్టానం ఆదేశానుసారం, బూత్, పంచాయతి స్థాయి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్ళాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం స్థాపించేందుకు అందరూ కృషి చేసి జనసేన పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాని తెలిపారు. అనంతరం కిషోర్ గునుకుల మాట్లాడుతూ జానీ మాస్టర్ కి పవన్ కళ్యాణ్ తో సాన్నిహిత్యం ఈ రోజుది కాదని, పవన్ కళ్యాణ్ ప్రజా సేవ కోసం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుండి ఉందని, అలాగే పవన్ కళ్యాణ్ ఎలాగైతే చిన్నప్పటినుంచి సేవాగుణం కలిగి ఉన్నారో, జానీ మాస్టర్ కూడా అదే విధంగా ప్రజలకు సేవ చేయడం కోసం జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.