జనసైనికులమృతి గుండెను కలిచివేసింది: చిరంజీవి, రామ్ చరణ్

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికి గురై చిత్తూరు జిల్లాలో మంగళవారం రాత్రి ముగ్గురు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ టీం ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల రూపాయలు అందించనున్నట్టు పేర్కొన్నారు.

ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందిస్తూ చిత్తూర్ లో పవన్ బర్త్‌డే కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo అంటూ చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇంకా ఈ ఘటనపై మెగా హీరో రామ్ చరణ్ కూడా స్పందిస్తూ కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు యువకులు మరణించారనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మీ ఆరోగ్యం, ప్రాణం కంటే ఏది విలువైనది కాదు. మీరు ఎల్లప్పుడు ఇది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వాళ్ళు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.