సోమశిల జలాశయానికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని జనసేన డిమాండ్

ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ స్థానిక జనసైనికులతో కలిసి వరదల కారణంగా దెబ్బతిన్న సోమశిల జలాశయం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ 2020 మరియు 2021వ సంవత్సరాల్లో వచ్చిన వరదల కారణంగా సోమశిల జలాశయం ముందుభాగం తీవ్రంగా దెబ్బతిని 40 అడుగుల గోతులు పడ్డాయని తెలిపారు. డ్యాం సేఫ్టీ రివ్యూ కమిటీ ఈ గుంటలు పరిశీలించి, ఇవి డ్యాం భద్రతకు ఎంతో ప్రమాదమని, 2020వ సంవత్సరంలోనే నివేదిక ఇచ్చినప్పటికీ, గత రెండు సంవత్సరాలుగా సోమశిల జలాశయ భద్రతను, పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజల ప్రాణాలను గాలికి వదిలి నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తూ ఉండటం ప్రజల ధన, మాన, ప్రాణాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యమే గత సంవత్సరం వరదల కారణంగా కడప జిల్లాలో ప్రజలపాలిట ఆధునిక దేవాలయం అయిన, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోవడమే కాకుండా, అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఇంత జరిగినప్పటికీ, సోమశిల జలాశయం భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలకు, దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు గా తయారైంది. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా, సోమశిల జలాశయం భద్రత పట్ల శ్రద్ధ వహించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో ప్రజలతో కలిసి జనసేన పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు.