జనసేనతోనే కార్మికులకు స్వర్ణయుగం

  • వైసీపీ ప్రభుత్వ ధనదాహానికి చిన్నాభిన్నమైన కార్మికుల జీవితాలు
  • కార్మికుల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికలు
  • జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాష్ట్రంలో కార్మికులకు గడ్డు రోజులు మొదలయ్యాయని, కార్మికుల పక్షపాతి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతోనే కార్మికులకు స్వర్ణయుగం రానుందని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. శనివారం కోబాల్డ్ పేట, కంకరగుంట ప్రాంతాల్లోని కార్మికులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో పూట గడవక నరకయాతన పడుతున్నామని, కుటుంబాన్ని పోషించుకోవటం కూడా కష్టమై పోతుందని కార్మికులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ప్రధానంగా ఇసుకను బ్లాక్ మార్కెట్ చేసి దానిని ఎప్పుడైతే ప్రధాన వనరుగా ఈ ప్రభుత్వం దోచుకోవడం మొదలైందో అప్పుడే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగం కుదేలై పోవటంతో దానిమీద ఆధార పడ్డ దాదాపు ముప్పై విభాగాల కార్మికులు పనుల్లేక పక్క రాష్ట్రాలకు వలసెల్లిపోయారని కార్మికులు తెలిపారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగం, పలు ఉపాధి రంగాల్లోని కార్మికులతో పాటూ రోజు వారీ కూలీల జీవితాలను వైసీపీ ప్రభుత్వం తమ ధనదాహంతో నరకకూపంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. జగన్ చేస్తున్న అసమర్ధ పాలనతో సుఖసంతోషాలతో గడుపుతున్న ఒక్క కుటుంబాన్ని చూద్దామన్నా ఎక్కడా కనపడటం లేదన్నారు. కార్మికుల జీవన విధానాలపై పవన్ కళ్యాణ్ కు పూర్తి అవగాహన ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కార్మికుల పక్షపాతి అని కార్మికులకు గుర్తుగా ఆయన మెడలో ఎప్పుడూ ఎర్ర కండువా ఉంటుందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారని, కార్మికులు ఆయనకు అండగా నిలవాలని నేరేళ్ళ సురేష్ కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షుడు చింతా రాజు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ సాగర్, నగర కమిటీ సభ్యులు పాములూరి కోటి, మెహబూబ్ బాషా, పులిగడ్డ గోపి, కొత్తకోట ప్రసాద్, సుంకే శ్రీను, చేజర్ల శివ, పసుపులేటి నరసింహరావు, గడ్డం రోశయ్య, గట్టు శ్రీకాంత్, కొలసాని బాలకృష్ణ, మధులాల్, కదిరి సంజీవ్, భూషయ్య, చెన్నం శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.