*పౌష్టికాహార పంపిణీపై అసంతృప్తి వ్యక్తం
వీఆర్ పురం, సీతంపేట గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని జనసేన పార్టీ నేతలు శుక్రవారం సందర్శించారు. చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందుతోందా అన్న విషయంపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు అర్హులైన వారికి ఫీడింగ్ సకాలంలో, సక్రమంగా అందడం లేదని చెప్పడంతో, తక్షణమే చరవాణి ద్వారా సూపర్వైజర్‌తో మాట్లాడి వివరాలు పొందారు. జనసేన మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యం విషయంలో నిఖార్సయిన శ్రద్ధ అవసరం, అందుకోసమే అంగనవాడి టీచర్‌తో పాటు పై స్థాయి అధికారులు సమర్థంగా వ్యవహరించాలని, ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను వేగవంతం చేసి అందరికీ ఫీడింగ్ అందేలా చూడాలని సూపర్వైజర్‌కు సూచించామన్నారు. ప్రభుత్వం శిశు సంక్షేమం, బాలికల సంరక్షణ కోసం పలు పథకాలు ప్రవేశపెట్టినా, స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పిల్లలకు సరైన పోషణ అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనుచిత పరిస్థితులపై ప్రతిస్పందనగా “ఇకపై మండలంలోని అన్ని అంగనవాడి కేంద్రాలను పార్టీ తరఫున పరిశీలించనున్నాం” అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల మహిళా అధ్యక్షురాలు బాగుల ప్రమీల, మండల కార్యదర్శులు బాగుల అంజన్ రావు, పెట్ట నాగేంద్రబాబు, యూత్ నాయకులు పెడపెట్ల పవన్ కళ్యాణ్, ముంజపు సాయిరాం, ములకాల కిషోర్, ముంజపు శ్రీరామ్, కొత్తూరి శేషు, మాచర్ల వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment