అంతర్వేది ఘటనపై ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టిన జనసేనానీ, జనసేన శ్రేణులు

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటనకు నిరసనగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ధర్మ పరిరక్షణ దీక్షలు చేపట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్షలు చేపట్టాలని ఆయన పిలుపునిస్తూ హైదరాబాద్‌లోని తన నివాసంలో పవన్ ఈ రోజు దీక్షకు దిగారు. ఇంట్లోనే ఉన్న ఫామ్‌ హౌస్‌లో ఆయన దీక్ష చేపట్టారు. అదే విధంగా ఏపీ వ్యాప్తంగా జనసేన నాయకులు, శ్రేణులు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టాయి.

విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, అమలాపురం, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, కడప, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం విజయనగరం పట్టణాల్లో జనసేన నాయకులు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు.

అంతర్వేది రథం ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని నేతలు విమర్శించారు. దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .