కడప జిల్లా వరద బాధిత ప్రాంతాల్లో జనసేన తక్షణ సాయం

• ముంపు గ్రామాల్లో పర్యటించిన పార్టీ నాయకులు
• బాధితులకు దుస్తుల పంపిణీ

కడప జిల్లాలో జవాద్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది రెండు ప్రాజెక్టుల మట్టికట్టలు తెగిపోవడంతో గ్రామాలకు గ్రామాలు వరదలో కొట్టుకుపోయాయి. ఎగువమందపల్లె, దిగువమందపల్లె, తొవ్వూరుపేట, పులపత్తూరు గ్రామాల్లో 20 అడుగుల ఎత్తున వరద ప్రవహించింది. చాలా వరకు ఇళ్లు కూలిపోగా, ఒక్కసారిగా విరుచుకుపడిన జలప్రళయం విలయం సృష్టించింది. 100 మందికి పైగా ప్రవాహంలో గల్లంతయ్యారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే బాధితులను పరామర్శించి, వారికి తమ వంతు తక్షణ సాయం అందించేందుకు జనసేన పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. కడప నియోజకవర్గం ఇంఛార్జ్ శ్రీ సుంకర శ్రీనివాస్ బాధితుల కోసం తనవంతు 300 దుప్పట్లు, చీరలు, లుంగీలు కొని వెంట తీసుకువెళ్లారు. ఆయా గ్రామాల్లో రాష్ట్ర కార్యదర్శులు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ ముఖరం చాంద్ లతో కలసి పంపిణీ చేశారు. వరద నష్టంపై క్షేత్ర స్థయిలో అంచనా వేసే ప్రయత్నం చేశారు. మంచినీరు కూడా దొరక్క ఇబ్బంది పడుతున్న వరద బాధిత ప్రాంతాల్లో మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహాయం అందే వరకు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కడప నగర అధ్యక్షులు శ్రీ మాలే శివ, నగర కమిటీ సభ్యులు శ్రీ నాగరాజు, శ్రీ బోరెడ్డి నాగేంద్ర, శ్రీ శేషు, శ్రీ శివప్రసాద్, శ్రీ శెట్టిపల్లె వెంకట ప్రసాద్, శ్రీ కొట్టే శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.