టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండ!

నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పడాలంటూ 2010లో టీటీడీ సూచించగా, 73 సొసైటీలు ఏర్పడ్డాయని, మరి ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎందుకని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఉన్న వ్యవస్థలను మార్చేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలని, కానీ వైసీపీ ఈ అంశంలో ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. ఇసుక పాలసీ, ఎయిడెడ్ విద్యాసంస్థలు… ఇలా వైసీపీ ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు.

ఈ రీతిలోనే 73 ఉద్యోగ సంఘాలను రద్దు చేసి కార్పొరేషన్ మార్చడం అంటే ఉద్యోగులను రోడ్డుమీదకు ఈడ్చే దారుణమైన చర్య అని విమర్శించారు. ఇది పొమ్మనకుండా పొగబెట్టడం వంటి నిర్ణయంగా భావించాల్సి ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిధులు దారిమళ్లించేందుకేనా? అసలు ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా? అని నిలదీశారు. టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు తాము అండగా ఉంటామని జనసేనాని భరోసా ఇచ్చారు.