షుగర్ ఫ్యాక్టరీ బాధితులకు సంఘీభావం తెలిపిన జనసేన

బకాయిలు చెల్లించకుండా లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ 15వేల మంది రైతులు నిరసనకు దిగారు. ఫ్యాక్టరీని ముట్టడించి జోరు వానలోనూ ధర్నాకు దిగారు. ధర్నాను ఆపేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి, అరెస్టులకు దిగింది. విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు ఘటనాస్థలికి చేరుకుని రైతులకు సంఘీభావం ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణా విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీ పాలూరి బాబు, సీతానగరం మండలంతో పాటు బొబ్బిలి నియోజకవర్గం నాయకులు రైతులను పరామర్శించిన వారిలో ఉన్నారు. రైతులతో మాట్లాడిన అనంతరం వారి పక్షాన జాయింట్ కలెక్టర్ తో చర్చించారు. వెంటనే జిల్లా కలెక్టరును సంప్రదించారు. ఫ్యాక్టరీ ఆస్తులు వేలం వేయించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ ఇచ్చారు. అయితే ఫ్యాక్టరీ ఆస్తుల అమ్మకం నిర్ణయాన్ని జనసేనపార్టీ ఖండించింది. ఆస్తులు అమ్ముకుంటూ పోతే ఉద్యోగులు, రైతుల భవిష్యత్తు ఏంటని ఈ సందర్భఅంగా శ్రీ పాలూరిబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పించుకుని రైతులకు న్యాయం చేయకుంటే జనసేన పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. శుక్రవారం రైతులు ఇచ్చిన బంద్ పిలుపుకు జనసేన మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నాయకులు శ్రీ గంగాధర్, శ్రీ సతీష్, శ్రీ రాజా, బలిజిపేట మండల నాయకులు శ్రీ అప్పలనాయుడు, సీతానగరం నాయకులు శ్రీ శివశంకర్ పోతల, శ్రీ వాసు, శ్రీ వెంకటరమణ, శ్రీ సత్యనారాయణ, శ్రీ దుర్గారావు, శ్రీ చంటి, శ్రీ రవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.