రాష్ట్రాన్ని పరిరక్షించుకునేందుకే జనసేన – తెలుగుదేశం పొత్తు

తుని, రాష్ట్రాన్ని పరిరక్షించుకునేందుకే జనసేన – తెలుగుదేశం పొత్తు అని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు సారధ్యంలో తుని సాయి వేదిక ప్రాంగణంలో తుని నియోజకవర్గ జనసేన – తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనమండలి విపక్ష నేత యనమల, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జనసేన – తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉద్దేశించి రామకృష్ణుడు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. గత నాలుగున్నర ఏళ్ళగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొరికిందంతా దోచుకు తిన్నాడని తీవ్రంగా విమర్శించారు. విశాఖ రాజధాని పేరుతో లక్షల కోట్ల దోచుకున్నాడని, దోచుకున్నదంతా ఇడుపులపాయి. దాచుకున్నాడని యనమల పేర్కొన్నారు. జనసేన – తెలుగుదేశం పార్టీలో కలయిక స్వచ్ఛమైనదని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే కలిసి పని చేస్తున్నామని యనమల స్పష్టం చేశారు. పార్టీల కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్ధం కావాలని, ప్రతి ఓటరు వ్యక్తిగతంగా కలవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఉభయగోదావరి జిల్లాలో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఈ జిల్లాలలో జనసేన – తెలుగుదేశం పార్టీకి ఎదురులేదని యనమల స్పష్టం చేశారు. రాష్ట్రంలో 6 జిల్లాల్లోఓట్లు తగ్గిపోయాయని, ఒకపక్క జనాభా పెరుగుతుంటే, ఓట్లు తగ్గడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టిడిపి అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి, జైలుకు పంపించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రజల నుంచి సపోర్టు లభిస్తుందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందులు దుర్గేష్ మాట్లాడుతూ పార్టీ జెండా రెపరెపలాడాలంటే కార్యకర్తలే కీలకమన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకే జనసేన – తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేసే పార్టీ విజయానికి పాటుపడాలన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం అప్రజాస్వామ్యకమని, ప్రాధమిక సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ అరెస్టు చేసి 52 రోజులుగా జైలులో నిర్బంధించారన్నారు. నవంబర్ 1 నుంచి ఇరు పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ప్రజల ముందుకు వెళతామన్నారు. రాష్ట్రంలో 2024లో జనసేన – తెలుగుదేశం సంయుక్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం తద్యమన్నారు. జనసేన – తెలుగుదేశం విడగొట్టేందుకు వైసిపి మైండ్ గేమ్ ఆడుతుందని దుర్గేష్ వెల్లడించారు. తుని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ యనమల దివ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల సునామీ సృష్టించాలన్నారు. విజయం మనదేనని ఆమె ధీమా వ్యక్తం చేస్తూ ప్రజలకు భరోసాగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన కార్యవర్గ సభ్యులు నాగేంద్ర, లోవరాజు మూడు మండలాల అధ్యక్షులు శ్రీనివాస్, నాయుడు, వెంకటరమణ మరియు మండల కార్యవర్గ సభ్యులు, జనసైనికులు మరియు టీడీపి శ్రేణులు అధిక సంఖ్యలో ర్యాలీగా పాల్గొని సభ విజయవంతం చేసారు.