సీతాయిలంక కాలనీలో జనసేన పర్యటన

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డలోని సీతాయిలంక కాలనీలో జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో జనసేన నాయకులు పర్యటించారు. కాలనీలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ సమస్యలు పరిశీలించారు. జనసేన నాయకులకు కాలనీ వాసులు తమ సమస్యలు చెప్పుకుని గొల్లుమన్నారు. కాలనీ ఏర్పడి పదమూడేళ్లు అయితే ఇప్పటి వరకూ తమకు ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు. అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీ లేక ఇళ్ల చుట్టూ మురుగు నీరు నిలిచి దుర్వాసన ప్రబలిందని తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. ఇళ్ల చుట్టూ నిలిచి ఉన్న నీటిలో నిత్యం పాములు, జలగలు, తేళ్లు, మండ్రగప్పలు సంచరిస్తున్నాయని తెలిపారు. ప్రమాదకర స్థితిలో గత్యంతరం లేక సరైన రోడ్లు డ్రైనేజీలు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతూ ఈ కాలనీలో జీవిస్తున్నామని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. తమ ఓట్ల కోసం నిత్యం వచ్చే నాయకులు ఓట్లు వేయించుకొని మళ్లీ కనిపించడం లేదన్నారు. వార్డు సభ్యులు మొదలుకొని సర్పంచ్, ఎమ్మెల్యే వరకూ తమ సమస్యలు ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్నారు. సీతాయిలంకలో రోడ్ల కోసం అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా, పాలకులకు చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ తమ కాలనీ వంక చూడలేదన్నారు. ఎన్నికల సమయంలోనే తమ ఓట్లు గుర్తొస్తాయని, గెలిచిన తర్వాత ఏ ఒక్కరూ తమ వంక చూడట్లేదని, తమ సమస్యలు పరిష్కారం చేయట్లేని తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నాయకులు కూడా తమ కాలనీకి రావద్దని మహిళలు స్పష్టం చేశారు. తమ సమస్యలు వినే వారిని, తమ సమస్యలు పరిష్కరించే వారిని స్వాగతించి ఓట్లు వేసుకుంటామని ప్రకటించారు. ఇంత అధ్వానంగా, దీనంగా తాము జీవిస్తున్నా తమ ఓట్లు వేయించుకున్న ఏ ఒక్కరూ తమ గురించి పట్టించుకోలేదని వాపోయారు. కాలనీకి రేషన్ ఇవ్వాల్సిన ఆటో కేవలం రెండు సార్లు వచ్చి మళ్లీ కనిపించలేదన్నారు. ప్రతి నెల ఈ మురుగులో డిపో వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నామని తెలిపారు.
జనసేన మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు మాట్లాడుతూ సీతాయిలంక ఏర్పడి 13 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు మారిన రెండు ప్రభుత్వాలు ఏ ఒక్కరు కూడా ఈ కాలనీలో సౌకర్యాలు కల్పించకపోవడం తీవ్ర విచారకరమన్నారు. కాలనీ మొత్తం మురుగు నీటితో, వర్షపు నీటితో నిండిపోయినా చుక్క మురుగునీరు కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా ఉందని తెలిపారు. కాలనీవాసులు మోడల్ సౌకర్యాలు లేక తీవ్ర దురవస్థ ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి ఇంటి ముందు ఉన్న మురుగు నీటిని వెంటనే బయటకు తోడిచ్చి బ్లీచింగ్ చల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం చేయకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో తామే ఒక తేదీ నిర్ణయించి రోడ్డు నిర్మిస్తామని స్పష్టం చేశారు.