డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని డోకిపర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎండీ శ్రీ పి.వి.కృష్ణారెడ్డి, ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్  శ్రీ పిచ్చిరెడ్డి కుటుంబ సమేతంగా పవన్ కు స్వాగతం పలికారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “రెండుమూడేళ్లుగా డోకిపర్రు రావాలనుకుంటున్నా.  బ్రహ్మోత్సవాలలోని కళ్యాణోత్సవానికి రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ శుభ సమయంలో పాల్గొనే అవకాశం కల్పించిన పారిశ్రామికవేత్తలు శ్రీ కృష్ణారెడ్డి గారు, శ్రీ పిచ్చిరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇక్కడకు ఆహ్వానించినందుకు మనస్పూర్తిగా వారికి ధన్యవాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా వారు సీఎస్ఆర్ కింద గ్రామానికి సమకూర్చిన సౌకర్యాలు అభినందనీయం. ముఖ్యంగా నిరంతర గ్యాస్ సరఫరా ఎంతో ఆకట్టుకుంది. భవిష్యత్తులో వారి సేవలు విస్తృతమై మరెంతో మందికి అందాల”ని ఆకాంక్షించారు.

అంతకుముందు డోకిపర్రు వెళ్లేందుకు ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, నిడుమోలు మీదుగా డోకిపర్రుకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి దారి పొడుగునా కార్యకర్తలు పవన్ కల్యాణ్ కు పూలవర్షంతో స్వాగతం పలికారు. ఉయ్యూరు వద్ద రైతులు, ప్రజలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. తమ సమస్యలపై గళం విప్పాలని, ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేందుకు సహకరించాలని కోరారు. నిడుమోలు వద్ద పామర్రు, గుడివాడ నియోజకవర్గాలతో పాటు  పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు జనసేనాని కి స్వాగతం పలికారు. అప్పటి వరకు వందల సంఖ్యలో ర్యాలీగా వచ్చిన కార్యకర్తల సంఖ్య నిడుమోలులో వేల సంఖ్యకు చేరుకుంది. వందలాది బైకులు, కార్లు పవన్ కల్యాణ్ వాహన శ్రేణిని అనుసరించగా పూల వర్షం మధ్య అందరికీ అభివాదం చేస్తూ డోకిపర్రు బయలుదేరారు. డోకిపర్రు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం పరిసర ప్రాంతాలు పవన్ వెంట తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కిటకిటలాడాయి.