కంభంపాటి హరిబాబుకు జనసేనాని అభినందనలు

మిజోరం గవర్నర్‌గా నియమితులైన ఏపీ భాజపా సీనియర్‌ నేత కంభంపాటి హరిబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆచార్యుడిగా, ప్రజాప్రతినిధిగా విశాఖకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే, ఎంపీగా.. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించారని వెల్లడించారు. హరిబాబు అనుభవం మిజోరం అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే హరియాణా గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోనున్న బండారు దత్తాత్రేయకు పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితంలో విశేష అనుభవం ఉన్న దత్తాత్రేయ… ఇప్పటివరకు హిమాచల్‌ ప్రదేశ్‌కి విలువైన సేవలు అందించారని కొనియాడారు. భవిష్యత్తులో హరియాణా రాష్ట్ర ప్రగతిలో తన వంతు పాత్రను పోషిస్తారని జనసేనాని ఆశాభావం వ్యక్తం చేశారు.