కడపలో జనసేన తదుపరి కౌలు రైతు భరోసా యాత్ర

•ప్రభుత్వ అడ్డంకుల్ని లెక్కచేయం
•పర్చూరు సభా వేదికను పరిశీలించిన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ముఖ్యమంత్రికి నిజాయతీ ఉంటే తన సొంత డబ్బుతో రైతులకు సాయం చేస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సూచించారు. ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించకపోగా అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. ఒక మంచి పనికి ముందుకు వస్తే అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. కడప జిల్లాలో వీర మహిళా నాయకురాలికి సభకు వెళ్లవద్దంటూ నోటీసులిచ్చారనీ, జనసేన పార్టీ తదుపరి కౌలు రైతు భరోసా యాత్ర కడప జిల్లాలోనే చేపట్టబోతున్నాం ఎలా అడ్డుకుంటారో చూస్తామన్నారు. శనివారం సాయంత్రం పర్చూరు, ఎస్.కె.పి.ఆర్. కళాశాల ప్రాంగణంలోని సభా వేదికను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “శ్రీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఏ విధంగానూ రైతులకు భరోసా కల్పించడం లేదు. కొత్తకౌలు రైతు చట్టం తీసుకువచ్చి రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రూ.7 లక్షల పరిహారం ఇస్తామని గొప్పలు చెప్పి ఇప్పుడు కేవలం 24 శాతం రైతులకే ప్రభుత్వం నుంచి సహాయం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాకు తిరిగి రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపుతుంటే ఈ ముఖ్యమంత్రికి ఎందుకంత భయం? మా పార్టీ నాయకులకు సభకు వెళ్లవద్దని నోటీసులు ఇవ్వడం అత్యంత దారుణం. కడప జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన 132 మంది కౌలు రైతులు కుటుంబాలను ఆదుకుంటాం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల లోనూ ఆత్మహత్యకు పాల్పడిన 13 మంది కౌలు రైతులకు సహాయం చేస్తాం. కచ్చితంగా రైతులకు అండగా నిలబడే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది” అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ ప్రకాశం, గుంటూరు జిల్లాల అధ్యక్షులు షేక్ రియాజ్, గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు పెదపూడి విజయ్ కుమార్, డాక్టర్ గౌతమ్ రాజ్, చిల్లపల్లి శ్రీనివాస్, శ్రీమతి రాయపాటి అరుణ, కందుకూరి బాబు, బెల్లంకొండ సాయిబాబు, కంచర్ల శ్రీకృష్ణ, వరికూటి నాగరాజు, మలగా రమేష్, రాయపాటి ప్రసాద్, కందుకూరి బాబు తదితరులు పాల్గొన్నారు.
•ప్రకాశం జిల్లా నుంచి జనసేనలోకి మరిన్ని చేరికలు
ప్రకాశం జిల్లా దర్శి, యరగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ, వైసీపీల నుంచి జనసేన పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ యరగొండపాలెం మండల నాయకులు బంటి క్రిస్టఫర్ తో పాటు 50 మంది, దర్శి నియోజకవర్గం, ఈదర, సందువారిపాలెం, బండివెలగల గ్రామాల నుంచి మరో 50 మంది పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ నాయకులు డాక్టర్ పి.గౌతమ్ రాజ్, వరికూటి నాగరాజుల ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.