- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం ప్రణాళికాబద్ధంగా పని చేద్దాం
- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి ప్రణాళికబద్ధంగా పని చేసి, ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలుపించుకుందామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. 2024 సార్వతిక ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయానికి ఆయన ఎంతగానో సహకారం అందించారని… ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనందరం కలిసికట్టుగా పనిచేసి ఆయన విజయానికి కృషి చేద్దామని అన్నారు. ఆయనకు మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని, అలాంటి వ్యక్తిని శాసనమండలికి పంపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, నియోజక వర్గాల ఇంచార్జిలు, పీఓసీలు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, క్షేత్ర స్థాయి నాయకులతో సోమవారం విజయవాడలోని శ్రీ శేషసాయి కళ్యాణవేదికలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా ఉన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వైసీపీ తన ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. వైసీపీ నాయకులు సొంత ఆస్తులను కూడబెట్టుకోవడానికి ప్రజాధనాన్ని లూటీ చేశారు. వైసీపీ పాపాలకు చరమగీతం పాడి ప్రజలకు మేలు జరగాలని పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేశారు. ముఖ్యంగా కూటమి పార్టీలు కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్లాలని నాలుగు శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను తగ్గించుకున్నారు. ఆయన త్యాగాలను ప్రజలు గుర్తించారు కనుకే ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అఖండ మెజార్టీతో విజయం సాధించింది.
- ప్రతి పోరాటంలో మీ పాత్ర కీలకం
జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి, క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన వరకు జన సైనికులు, వీర మహిళలు చేసిన సేవలు మరువలేనివి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దులో పోలీసులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నప్పుడు మీరు చేసిన పోరాటం మరువలేనిది. ఈ రోజు మేము మంత్రులుగా, శాసనసభ్యులుగా ఉన్నామంటే దానికి కారణం ఎన్నికల్లో మీరు చూపించిన తెగువే. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నామన్నా, శాసనసభలో 21 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించామన్నా దానికి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రతి జనసైనికుడు, వీరమహిళ పడిన కష్టమే కారణం. - ఎప్పుడూ ప్రజాపక్షమే
జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశాం. ముఖ్యంగా కౌలు రైతుల ఆత్మహత్యలపై ప్రతి జిల్లాలో పర్యటించి వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడ్డాం. ధాన్యం కొనుగోళ్లల్లో దగా పడ్డ రైతులకు అండగా నిలబడటానికి గోదావరి జిల్లాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండుసార్లు పర్యటించారు. కాకినాడలో దీక్ష చేశారు. అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం పెట్టిన రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలను నెల రోజుల్లో రైతులకు చెల్లించాం. ధాన్యం కొన్న 24 గంటల్లో అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో వైసీపీ ప్రభుత్వం 4.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇంకా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. శ్రీ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రచిస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు గారు రాత్రిపగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. - ఎవరినీ వదలబోము
కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. అలా అని గత ఐదేళ్ల కాలంలో అకారణంగా జనసైనికులు, వీరమహిళలపై దాడులు చేసిన వారిని వదలబోము. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీర మహిళల వ్యక్తిత్వ హననం చేశారు. ప్రభుత్వ చేతకానితనాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించిన పాపానికి జన సైనికులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్భందించారు. వాటిని మేము అంత తేలిగ్గా మరిచిపోం. అక్రమ కేసులు బనాయించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం. మరో ఎనిమిది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరు సమష్టిగా పని చేసి కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాల”ని కోరారు. - సార్వత్రిక ఎన్నికల స్ఫూర్తిని కొనసాగిద్దాం: కందుల దుర్గేష్
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ “2024 సార్వత్రిక ఎన్నికల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో దానిని కొనసాగించాలి. వచ్చే ఐదేళ్లలో అద్భుతమైన పాలన ప్రజలకు అందాలి అంటే రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు జరిగినా కూటమి అభ్యర్థులే గెలిపించుకోవాలి. ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి రాజకీయంగా చాలా అనుభవం ఉంది. ఆయన్ను గెలిపించుకుంటే నిరుద్యోగుల సమస్యలు, ఇతర అంశాలపై మండలిలో గొంతు విప్పగలరు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాం. ఈ ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. - రాష్ట్రం కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు : ఆలపాటి రాజేంద్రప్రసాద్
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ… “ కూటమి తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శ్రీమతి పురందేశ్వరి లకు కృతజ్ఞతలు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పును శిరసావహిస్తూ కూటమి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఎన్నో సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వానికి ఇచ్చాం. వాటిని పరిష్కరించాలంటే ప్రభుత్వానికి మనందరికి సహకారం అవసరమ”ని అన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు వడ్రాణం మార్కండేయ బాబు, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, నయుబ్ కమల్, అక్కల గాంధీ, బండి రామకృష్ణ, శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment