ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న జనసేన పిటిషన్ పై హైకోర్టులో విచారణ

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ నే కొనసాగిస్తున్నారని, ఈ స్థానిక ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. జనసేన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఆదేశించింది. జనసేన అభ్యంతరాల పట్ల అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఎస్ఈసీని ఆదేశించాలని, అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఎంతో మారిపోయాయని, పాత నోటిఫికేషన్ తోనూ ఎన్నికలు నిర్వహించడం సబబు కాదని జనసేన తన పిటిషన్ లో పేర్కొంది.

కాగా, లాక్ డౌన్ కు ముందు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, తమ నేతలను బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ఆరోపించారు. నామమాత్రంగా ఫిర్యాదులు స్వీకరించారే తప్ప చిత్తశుద్ధి లేదని, ఫిర్యాదుల వరకు న్యాయం చేస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెబుతున్నా ఆయన హామీ అమలవుతుందన్న నమ్మకం లేదని పవన్ పేర్కొన్నారు. అందుకే తాజా నోటిఫికేషన్ ఇస్తే తప్ప న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు.