అధికారులకు జనసేన వినతిపత్రం

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ ఆధ్వర్యంలో నగరంలోని కుంబాభిషేకం ప్రాంతంలో స్థానిక మత్స్యకారులను నిరోధించుచున్న సంఘటనలపై వారికి మద్దతు తెలియచేస్తూ కాకినాడ రెవిన్యూ డివిజనల్ అధికారికి అలాగే కాకినాడ మునిసిపల్ కార్పోరేషన్ కమీషనరుకి, స్థానిక మత్స్యశాఖ అధికారులకి వినతిపత్రాలను సమర్పించారు. ఈ వినతిపత్రంలో తరతరాలుగా నివసిస్తున్న స్థానిక మత్స్యకారులు కాకినాడ సిటిలో అనేక ఏండ్లుగా తమ కులవృత్తిని నమ్ముకుని సముద్రతీర ప్రాంతంలో గత ప్రభుత్వాలు ఏర్పరిచిన బలహీన వర్గాల ఇళ్ళలో నివసిస్తూ సముద్రంపై వేటని సాగిస్తూ పిదప కుంభాభిషేకం ప్రాంతంలో పడవలకు మరమత్తులు, వలలకు మరమ్మత్తులు చేసుకుంటూ చేపలు మరియు మత్స్య సంపదని అమ్మకాలు చేస్తుంటారని, లోగడ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇక్కడ మత్స్యకారులకోసం అభివృద్ధి పనులు చేయడానికి శంఖుస్థాపన కూడా చేసారన్నారు. గత నెలలనుండీ ఈప్రాంతంలో ఇతరులకు ప్రవేశం లేదనీ, శిక్షార్హమనే బోర్డులు నెలకొలిపి స్థానిక మత్స్యకారుల కార్యక్రమాలను నిరోధిస్తూ చర్యలు చేపడుతున్నారు అని పేర్కొన్నారు. అనాదిగా ఈస్థలంలో వేలాదిమంది ప్రజలు ఏటా చేపట్టే మహా కుంభాభిషేకం మన రాష్ట్రంలోనే ప్రసిద్ధం కూడా అని, కావున ప్రజల ఆచార వ్యవహారాలకు భంగం కలగకుండా, వారు అశాంతితో ఆందోళన చెందకుండా ఈ స్థలాన్ని ప్రజలందరు ప్రజోపకార్యాలకు ఉపయోగించుకునే విధంగా జగనన్న సర్వేలో సర్వే జరిపించి సరిహద్దులను ఏర్పరచి గ్రామకంఠంగా పరిగణిస్తూ తగిన ఉత్తరువులు జారీ చేసి కాకినాడ సిటి ప్రజల మనోభావాలను గౌరవించవలసినదిగా కాకినాడ సిటి జనసేన పార్టీ ఈ వినతిపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, దుమ్ములపేట జనసైనికులు అమర్, దుర్గాప్రసాద్ మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.