పర్యావరణ పరిరక్షణకై న్యాయ పోరాటంలో వైసిపిపై జనసేన విజయం

కాకినాడ: పర్యావరణ పరిరక్షణ విషయంలో జనసేన మరొక ఘన విజయం సాధించడం జరిగిందని జనసేన పార్టీ నాయకురాలు మాజీ మేయర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ అన్నారు. వైసీపీ ప్రభుత్వం మడ అడవులు, అటవీ భూములు, ఆవ భూములు అనేది లేకుండా ఎక్కడపడితే అక్కడ స్థలాలు తీసుకొని అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతుందని, దీనిపై జనసేన పార్టీ తరఫున పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ చేసిన న్యాయ పోరాటంలో న్యాయ స్థానంలో మడ అడవులకు సంబంధించి కేసు విజయం సాధించడంతో దానికైన ఖర్చులు ఇప్పించవలసిందిగా జనసేన నాయకులు జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాకినాడ మడ అడవులను నాశనం చేసి అక్కడ పేదలకు ఇల్లు కట్టిస్తామని మాయ ప్రకటన చేయడంతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై జనసేన పార్టీ సాక్షాలతో సహా చెన్నై జాతీయ హరిత ట్రిబ్యునల్ శాఖలో కేసు నంబర్ 65/2020 దాఖలు చేయడం జరిగిందన్నారు. దీనిపైన స్పందించిన ట్రిబునల్ పర్యావరణ విధ్వంసంపై సదరు కమిటీ రిపోర్ట్ ప్రకారం తాత్కాలిక పరిరక్షణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, కోర్టు ఖర్చులుకోసం ఖర్చుపెట్టిన డబ్బులను ప్రభుత్వం నుండి ఇప్పించాలని కలెక్టర్ ను కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.