జయహో బీసీ సభ అట్టర్ ప్లాప్: పొలసపల్లి సరోజ

  • వైకాపా బీసీ సభ అట్టర్ ఫ్లాప్
  • మరో మారు బీసీలు మోసపోరు
  • వైకాపా వారి ఉపాధి కోసమే కార్పొరేషన్ల ఏర్పాటు
  • జనసేన రాష్ట్ర కార్యదర్శి సరోజ విమర్శ

కాకినాడ: బీసీలకు ఎంతో చేస్తున్నామని వారే తమ పార్టీకి వెన్నుముక అంటూ వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ సభ అట్టర్ ప్లాప్ అయిందని జనసేన రాష్ట్ర కార్యదర్శి సరోజ ఎద్దేవా చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సభలో సీఎం వైఎస్ చేసిన ప్రసంగం పట్ల బీసీ ప్రజలు ఎంతో నిరాశకు గురయ్యారు. ఎటువంటి భరోసా, భద్రత ఉపాధి వంటి అంశాలు లేకుండా సీఎం ప్రసంగించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేసారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ గురువారం ఓ ప్రకటనలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. బీసీలకు ఎంతో చేస్తున్నామని చెప్పి 56 కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించారని వారి పదవీకాలం ముగిసినా ఇంతవరకు ఏ ఒక్క బీసీ కులానికి నిధులు గాని, వ్యక్తిగత రుణాలు గాని ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు కేవలం వారి పార్టీ సభ్యుల ఉపాధి కోసమే గాని బీసీలకు అభివృద్ధికి మాత్రం కాదన్నారు. బీసీలకు ఎటువంటి ఉపాధి, భద్రత కలిగించకుండా సీఎంతో పాటు అక్కడ హాజరైన వారు చేసిన ప్రసంగం పట్ల బీసీలు అసహనం వ్యక్తం చేశారని చెప్పారు. పేరుకే బీసీలకు మంత్రి పదవులు ఇస్తున్నారని వారిపై పెత్తనానికి సీఎం సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకుంటున్నారని సరోజ తెలిపారు. 56 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు విడుదల చేయకుండా బీసీల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ నిజస్వరూపాన్ని బీసీ సామాజిక వర్గీయులు గ్రహించాలని సూచించారు. జయహో బీసీ సభను సీఎం జగన్ బీసీలను పనికి వచ్చే యంత్రాలుగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. తమ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రానుందని అప్పుడు బీసీలకు అధిక స్థానాలు, సముచిత గౌరవం కల్పిస్తామన్నారు. కార్పొరేషన్లకు నిధులు ఇవ్వని సీఎం జగన్ విధానాలపై బీసీలు తిరగబడాలని సరోజ పిలుపునిచ్చారు.