సాహసాలు, పోరాటాలు, త్యాగాల ప్రతిరూపమే ‘జయకేతనం’

• జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ‘జయకేతనం’గా నామకరణం
• ఉమ్మడిగా సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్ ఉత్సవమే ఆవిర్భావ సభ
• ప్రవేశ ద్వారాలకు ముగ్గురు మహనీయుల పేర్లు
• ఇతర రాష్ట్రాల నుంచి సభకు వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు
• ప్రత్యేకంగా రూపొందించిన సభ పోస్టర్లు ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్

ఎందరో త్యాగాలు, మరెందరో పోరాటాలు, ఇంకెందరో త్యాగాలతో జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్ విజయాన్ని ఒక ఉత్సవంలా జరుపుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన మేరకు ఆవిర్భావ దినోత్సవాన్ని ‘జయకేతనం’ సభగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలోని చిత్రాడ వేదికగా జరగబోతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జయకేతనం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “జనసేన పార్టీ మొదటి నుంచి జాతీయ నాయకులను, చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వారిని గుర్తు పెట్టుకునేలా ఏ కార్యక్రమం అయినా రూపొందించి ముందుకు వెళుతుంది. దీనిలో భాగంగా ఆవిర్భావ దినోత్సవ సభకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు జయకేతనంగా నామకరణం చేశాం. ఎన్నో పోరాటాలు, జన సైనికులు, వీర మహిళల సాహసాలతో కూడిన 100 శాతం విజయం అందుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా చేసుకొనే గొప్ప వేడుకగా ఇది మిగిలిపోతుంది. ఇక సభా స్థలానికి వెళ్లే మూడు ప్రవేశ ద్వారాలకు ఈ ప్రాంతానికి ఎంతో పేరు తెచ్చిన ముగ్గురు గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టుకుని వారిని గౌరవించుకుంటున్నాం. మొదటి ద్వారానికి పిఠాపురం రాజాగా ఎన్నో విద్యాలయాలకు స్థలాలు, నిధులు దానం, ఈ ప్రాంతంలో ఎంతోమందిలో అక్షర కాంతులు నింపిన పిఠాపురం రాజు శ్రీ రాజా సూర్యారావు బహుదూర్ గారి పేరును, అలాగే రెండో ప్రవేశ ద్వారానికి మరో వితరణ శీలి… విద్యా సంస్థలకు, ధార్మిక, సేవా కార్యక్రమాలకు తన సంపాదన దానం ఇచ్చిన శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ గారి పేరును, జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రత్యేకంగా స్మరించుకొనే అపర అన్నపూర్ణగా పేరుగాంచిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరును మూడో ద్వారానికి పెట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఈ ప్రాంత మహనీయులు, వితరణలు చేసిన వారి స్ఫూర్తిని చాటడం, వారిని గౌరవించుకోవడం, భావి తరాలకు వారి ఘనత చాటి చెప్పడమే జనసేన పార్టీ లక్ష్యం. దీనికి అనుగుణంగానే కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాం.
• తుది దశకు ఏర్పాట్లు
సభ అద్భుతంగా జరిగేలా ఇప్పటికే పార్టీ నాయకులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వారందరికీ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సాయంత్రం మూడు గంటల నుంచి సభ ప్రారంభమై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలవుతుంది. మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా, జనసేన పార్టీ పోరాటాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించాం. అలాగే పార్కింగ్ ఏర్పాట్లు, భోజన వసతి ఏర్పాట్లను పక్కాగా చేశాం. పోలీసుల సహకారం తీసుకొని సభను విజయవంతం చేసేందుకు తగిన విధంగా సన్నద్ధం అయ్యాం” అన్నారు.
• మీడియాకు ప్రత్యేక ఏర్పాట్లు: పిడుగు హరిప్రసాద్, శాసన మండలిలో ప్రభుత్వ విప్
ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరి ప్రసాద్ గారు మాట్లాడుతూ “పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మీడియాకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వారికి ప్రత్యేక గ్యాలరీతోపాటు వారి విధులకి అవసరమైన సాంకేతిక సదుపాయాలు కల్పిస్తున్నాము. ఇంటర్నెట్ ఏర్పాట్లు, అలాగే వారికి అవసరమయ్యే కంప్యూటర్ సిస్టంలను సైతం అందుబాటులో ఉంచుతున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీడియా ప్రతినిధులు పని చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని సైతం ఏర్పాటు చేశాం. ప్రత్యేక పాసులను మీడియా కమిటీ ఇవ్వనుంది. మీడియా ప్రతినిధులు కూడా తగిన విధంగా సహకరిస్తారని ఆశిస్తున్నాం ” అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పంతం నానాజీ, గిడ్డి సత్యనారాయణ, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, జనసేన నాయకులు శ్రీమతి చల్లా లక్ష్మి, శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, వై.శ్రీనివాస్, ఇర్రంకి సూర్యారావు పాల్గొన్నారు.

Share this content:

Post Comment