తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ప్రమాణం స్వీకారం చేసిన జస్టిస్‌ సతీష్‌ చంద్ర..

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో సరిగ్గా 11 గంటలకు గవర్నర్ తమిళసై సీజేచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు. కాగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది.

జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ 1961 నవంబర్‌ 30న మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్‌.శర్మ భోపాల్‌లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ఇక సతీష్ చంద్ర.. ప్రాథమిక విద్య జబల్‌పూర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌లో పూర్తి చేశారు. 1981లో డాక్టర్‌ హరిసింగ్‌గౌర్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా పొందారు. ఎల్‌ఎల్‌బీలో మూడు బంగారు పతకాలు అందుకున్నారు. 1993లో అడిషనల్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ కౌన్సెల్‌గా నియమితులయ్యారు సతీష్ చంద్ర. 2003లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడంతో ఆగస్టు 31 నుంచి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.