కార్తీక సోమవతి అమావాస్య విశేషాలు..

కార్తీకమాసంలో చివరి సోమవారం, ఈరోజు సోమవారం మరియు అమావాస్య కావడం మరీ విశేషం. అమావాస్య సోమవారం రావడాన్ని సోమవతి అమావాస్యగా పిలుస్తారు. ఈరోజు అత్యంత పవిత్రమైనది. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.

అమావాస్య నాడు శివుని పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ రోజున అమావాస్య పూజ పొద్దున్నే ఇంట్లో ముగించుకోవాలి. తర్వాత దగ్గర్లోని శివాలయాన్ని సందర్శించాలి.

పురాణగాథ:

దక్షయజ్ఞంలో దక్షుడు తన అల్లుడైన శివుని అవమానించేందుకే యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.

సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన జటాఝూటం నుంచి వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన గాయపరిచాడు. శివగణాల చేతిలో గాయపడిన వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేక పోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ. ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి. తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.

జాతకదోష నివారణకు:

సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలో తెలుసుకుందాం.. శివాలయంలో వుండే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీకంలో వచ్చే ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. దీంతోపాటు పితృ దేవతలకు ఈ రోజున పిండప్రదానం చేస్తే పెద్దలు సంతృప్తి చెందుతారు. తద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.