నాగార్జునకు జోడీగా కాజల్ అగర్వాల్.. అధికారిక ప్రకటన

సాధారణంగా పెళ్లయిన కథానాయికలకు చాలావరకు అవకాశాలు తగ్గిపోతాయి. అయితే, ఇటీవలి కాలంలో మాత్రం కొందరి విషయంలో ఇది తప్పని రుజువవుతోంది. పెళ్లయినా కూడా సమంత ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా వుంది. మరోపక్క, తాజాగా పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ కు కూడా అవకాశాలు వస్తూనే వున్నాయి. ఇప్పటికే చిరంజీవి సరసన ‘ఆచార్య’లోను, హిందీలో ‘ముంబై సాగా’ సినిమాలోనూ నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా నాగార్జున సినిమాలో నటించే ఛాన్స్ కూడా వచ్చింది.

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో కథానాయికగా కాజల్ ను ఖరారు చేశారు. ఈ రోజు ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తమ టీమ్ లోకి కాజల్ ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. త్వరలోనే కాజల్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతుంది.