కేంద్ర వైఖరికి నిరసనగా కేసిఆర్ మహాధర్నా
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) మహాధర్న చేపట్టింది. టిఆర్‌ఎస్‌అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎంపి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డిసిసిబి, డిసిఎమ్మెస్, రైతు బంధు సమితులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ నిరసనకు కెసిఆర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. తెలంగాణ రైతాంగ ఉత్పత్తుల కొనుగోలు చేయాలని, రైతు ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ యుద్ధం ప్రారంభించామని, హైదరాబాద్ నగరంతో ప్రారంభమైన ఈ యుద్ధం.. ఢిల్లీకి వరకు యాత్ర చేయాల్సిన అవసరముందని అన్నారు. ఎక్కడి వరకైనా పోయి మన ప్రజల ప్రయోజనాలను రక్షించుకోవాలని కోరారు. తెలంగాణ విప్లవ గడ్డని, పరాయి పరిపాలకుల విష కౌగిలి నుండి బయటపడి.. ఇప్పుడిప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుని.. ముందుకు పోతున్న తెలంగాణాపై కేంద్రం విధానాలు దాపురిస్తున్నాయన్నారు. కేంద్రం కళ్లు తెరిపించేందుకు ఈ యుద్ధం ప్రారంభిచామని అన్నారు. అనంతరం సిఎం గవర్నర్ తమిళసైను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. కెసిఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజభవన్‌కు కాలినడకన వెళతారని తెలుస్తోంది.