హుజూరాబాద్‌లో నేడు కేసీఆర్ బహిరంగ సభ.. ‘దళితబంధు’ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘దళితబంధు’ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హుజూరాబాద్‌లో ప్రారంభించనున్నారు. శాలపల్లి-ఇంద్రానగర్‌లో నేడు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

నియోజకవర్గంలో దళిత కుటుంబాల్లోని అర్హుల ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం జమచేయనుంది.  ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత కింద రూ. 500 కోట్లు విడుదల చేసింది. నేటి సభలో సీఎం కేసీఆర్ అర్హులైన 15 మంది లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు పంపిణీ చేస్తారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు లబ్ధిదారులకు డెబిట్ కార్డులు కూడా ఇస్తారు.

ప్రభుత్వం అందించిన సొమ్ముతో ఏయే పరిశ్రమలు పెట్టుకోవచ్చో తెలుపుతూ ముద్రించిన కరపత్రాలను కూడా అందిస్తారు. దళితబంధు పథకంపై పలువురు కవులు రాసిన పాటలను ఈ సభలో విడుదల చేస్తారు. కాగా, నేటి మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న సీఎం 2 గంటలకు బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 4 గంటల వరకు సభలోనే ఉండి, ఆ తర్వాత హైదరాబాద్‌కు బయల్దేరతారు. సభలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కరీంనగర్, హనుమకొండ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.