వరద బాధిత ప్రాంతాలను సందర్శించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి మంత్రి అనిల్ రాజీనామా చేయాలని డిమాండ్

నెల్లూరు నగరంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఒకటైన భగత్ సింగ్ కాలనీని బుధవారం జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి సందర్శించి వరద బాధితుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఒక్కో ఇంటికి 5800 రూపాయల సాయాన్ని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ 2వేల రూపాయలు కూడా అందలేదన్నారు. కట్టు బట్టలతో బయటకు వచ్చిన బాధితుల ఇళ్ళలో సామాన్లు, బట్టలు, బండ్లు అన్నీ పాడైపోయాయని, అసలు నెల్లూరులో ఈ కృత్రిమ వరదకి కారణమైన ప్రభుత్వం బాధ్యత వహించి ప్రతి ఇంటికి 50వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో పెన్నా నది వరద ప్రకృతి వైపరీత్యం ఎందుకు కాదంటే ఇది సోమశిల డ్యామ్ నిర్వహణ చేతకాని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘోర వైఫల్యమన్నారు. 5 లక్షల పైగా క్యూసెక్కుల నీరు పెన్నా భరించలేదని, పెన్నానది దిశను కూడా ఎవరూ అంచనా వేయలేరని అన్నారు. నవంబర్ 4 నాటికే తుఫాను హెచ్చరిక ఉందన్నారు. కానీ సోమశిల నీటి విడుదల అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గతేడాది నేర్పిన పాఠాలను గుర్తించకుండా, సోమశిలతో సహా పెన్నా పైనున్న పింఛా, అన్నమయ్య వంటి నీటి ప్రాజెక్టులను మరమ్మత్తులు చేయించకుండా మంత్రి అనిల్ తుఫాను సందర్భంలో పరిస్థితులు సమీక్షించకుండా, పర్యవేక్షించకుండా ప్రజల్ని ముంచేస్తూ అసెంబ్లీ వద్ద సీఎం జగన్ కి భజన చేస్తూ తిష్ట వేసాడన్నారు. వరద పరిస్థితులు చేయి దాటాక వచ్చి చేతులు ఎత్తేసాడన్నారు. వరద పరిస్థితులను సమీక్షించకుండా మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో ముసిముసి నవ్వులు నవ్వుతూ కాలం వెళ్లదీసారనన్నారు. ఈ విపత్తుకి కారణమైన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో s.k.ఆలియా, శిరీష రెడ్డి, కుక్క ప్రభాకర్, జీవన్, సురేష్, సాయి, వంశీ, యశ్వంత్, మాసి వాలి, షారుక్, నాని తదితరులు పాల్గొన్నారు.