ఆన్‌లైన్‌లో దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్‌ గణపతి

ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకోవాలి అనుకొనే భక్తులు ఆన్‌లైన్‌లో దర్శించుకోవాలని భక్తులను ఉత్సవ కమిటీ కోరింది. www.ganapathideva.org వెబ్‌సైట్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ, సాయంత్రం 5 నుంచి 9గంటల వరకూ ఉచిత దర్శన సదుపాయం కల్పించామని తెలిపింది. ఆన్‌లైన్‌లో గోత్రనామాలు నమోదు చేసుకుంటే.. స్వామి వారికి పూజలు చేస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌ పేర్కొన్నారు. మండపం వద్దకు వస్తే దూరం నుంచి దర్శించుకోవడం మినహా ఇవేమీ ఉండవని చెప్పారు. కరోనా నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా విజ్ఞప్తి చేస్తున్నామని కమిటీ తెలిపింది. కానుకలు కూడా ఆన్‌లైన్‌లోనే సమర్పించొచ్చని పేర్కొంది. ఇక, వినాయక చవితి రోజైన శనివారంతోపాటు ఆదివారం కూడా ధన్వంతరీ నారాయణ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తొలి రోజున ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డి, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ కార్యదర్శి భగవంతరావు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మియాపూర్‌ మిఠాయి వర్తకుడు మరమరాలతో చేసి సమర్పించిన 5అడుగుల వినాయకుడు.. ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు మహేష్‌ యాదవ్‌, తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ అధినేత మల్లిబాబు సమర్పించిన లడ్డూలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక ప్రదర్శనలతో ఊరేగింపుగా వచ్చిన ఒగ్గు డోలు కళాకారులు.. గణపతికి 18అడుగుల జంధ్యం, 18అడుగుల చేనేత కండువా, పట్టువస్త్రాలు, గరిక మాలలు సమర్పించారు.