లక్ష్యానికి దూరంగా ఖరీఫ్ ధాన్యం సేకరణ

*10 లక్షల టన్నుల కొనుగోళ్లకు ప్రభుత్వం మంగళం
*నగదు చెల్లింపులో జాప్యం, ఈ క్రాప్ నిబంధనలే ప్రతిబంధకాలు
*గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకున్న రైతులు
*అన్నదాతకు అక్షరాలా రూ.250 కోట్ల నష్టం
* లోపాలు సరిదిద్దుకుంటేనే రబీలోనైనా పరిస్థితి మారేది

మద్దతు ధరకు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధించలేదు. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో మద్దతు ధర కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకైనా పంట అమ్ముకుందామని ఆశించిన రైతులకు చుక్కెదురైంది. ధాన్యం కొనుగోలు చేసిన తరవాత రెండు నెలలకు కూడా నగదు చెల్లించకపోవడం, ఈ క్రాప్ నిబంధనలతో రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొద్ది రోజుల్లో రబీ సీజన్ కూడా ముగియనుంది. ఇప్పటికే ధాన్యం పెద్ద ఎత్తున మార్కెట్లకు వస్తోంది. రబీ సీజన్లోనైనా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ధాన్యం సేకరిస్తుందా లేదా అనే అనుమానం కలుగుతోంది.
*రబీ కొనుగోళ్లు మొదలైనా ఖరీఫ్ డబ్బుల కోసం ఎదురుచూపులు
2021 ఖరీఫ్ ధాన్యం సేకరణ లక్ష్యం 50 లక్షల టన్నులు. ప్రభుత్వం 40.65 లక్షల టన్నులు సేకరించి చేతులు దులిపేసుకుంది. ధాన్యం కొనుగోలు చేసిన తరవాత రైతులకు సకాలంలో నగదు జమ చేయకపోవడం, ఈ క్రాప్ నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టడంతో తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లో నగదు చెల్లించేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో చెల్లింపులు చేస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రూ.7911 కోట్ల విలువైన 40.65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే ఖరీఫ్ కొనుగోళ్లు ఆపేసినా నేటికీ రైతులకు ఇంకా రూ.500 కోట్లు అందాల్సి ఉంది. ధాన్యం అమ్ముకుని రెండు నెలలు దాటిపోతున్నా నేటికీ డబ్బు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రబీ కొనుగోళ్లు ప్రారంభం అయినా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నగదు చెల్లించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
*ఎకరా నష్టం రూ.5500
కేంద్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1960, సాధారణ రకాలకు రూ.1940 చెల్లిస్తోంది. అంటే 75 కేజీల బస్తాకు రూ.1455 ధర దక్కాల్సి ఉంది. ప్రభుత్వానికి ధాన్యం అమ్మినా సకాలంలో నగదు రాకపోవడంతో చాలా మంది రైతులు 75 కేజీల బస్తా రూ.1250కే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు. దీంతో ఒక్కో రైతుకు సగటున క్వింటాకు రూ.250 నష్టం వాటిల్లింది. కనీసం ఎకరాకు 30 బస్తాల దిగుబడి లెక్కించినా ఒక్కో ఎకరాకి రైతుకు రూ.5500 నష్టం వాటిల్లింది. అంటే ప్రభుత్వం లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఖరీఫ్ సీజన్ లోనే రూ.250 కోట్లు నష్టపోయారు. వివరంగా చెప్పాలంటే ప్రభుత్వం లక్ష్యం కన్నా 10 లక్షల టన్నుల ధాన్యం తక్కువగా కొనుగోలు చేసింది. 10 లక్షల టన్నులంటే కోటి క్వింటాళ్లు. క్వింటాకు రూ.250 చొప్పున కోటి క్వింటాళ్లకు రైతులు నష్టపోయింది అక్షరాలా రూ.250 కోట్లు. ప్రభుత్వం సకాలంలో నగదు చెల్లించి ధాన్యం కొనుగోలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగేది. పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.25000 కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం ధాన్యం అమ్మిన రైతులకు మాత్రం సకాలంలో చెల్లింపులు చేసేందుకు మాత్రం ఆసక్తి చూపకపోవడం దారుణం. ఆన్ లైన్లో వస్తున్న పొరపాట్ల వల్ల కూడా రైతులు ప్రభుత్వానికి ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. గతంలో ఈ క్రాప్ గురించి పెద్దగా అవగాహన లేక రైతులు ఈ క్రాప్ నమోదుకు ఆసక్తి చూపలేదు. దీంతో ధాన్యం అమ్ముకోవడంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో నష్టం అని తెలిసినా రైతులు విధిలేక వ్యాపారులకే ధాన్యం అమ్ముకున్నారు.
*ధాన్యం సేకరణ ఎందుకు తగ్గింది….
ధాన్యం సేకరణ తగ్గడానికి ప్రధాన కారణం ప్రభుత్వానికి అమ్మితే సకాలంలో నగదు రాకపోవడం. దీనికితోడు ఈ క్రాప్ నమోదు తప్పనిసరి చేయడం రైతుల పాలిట శాపంగా మారింది. పంట వేయక ముందే రైతు భరోసా కేంద్రాల్లో ఏ పంట వేయాలనుకుంటున్నారో నమోదు చేయించుకోవాలనే నిబంధన పెట్టారు. ఇది రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. 2020 ఖరీఫ్ లో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకోగా 47.33 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. అప్పట్లో ఈ క్రాప్ తప్పనిసరి కాకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున మద్దతు ధరకు ధాన్యం అమ్ముకున్నారు. తాజాగా ఈ క్రాప్, ఈ కేవైసీ తప్పనిసరి కావడంతో ధాన్యం అమ్ముకోవడంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ ధాన్యం సేకరణ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. ఈ క్రాప్ పై ప్రభుత్వం అవగాహన కల్పించి తగిన విధంగా సహకరించకపోతే చివరకు నష్టపోయేది రైతే.
*రబీలోనైనా లక్ష్యం చేరుకుంటారా?
రబీలో 21 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 60 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రభుత్వం ఈ రబీలో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 5 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. 26 జిల్లాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికి 1.04 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యంలో తేమ 17 శాతం మించరాదనే నిబంధన ఉంది. అయితే వేసవి కాలం కావడంతో ధాన్యంలో తేమ శాతం ప్రభుత్వం విధించిన నిబంధనకన్నా తక్కువే నమోదవుతోంది. వర్షాలు, తుఫాన్లకు పంట తడిస్తే తప్ప ధాన్యంలో తేమ శాతం పెద్ద సమస్య కాదు. అయితే రబీలోనూ ధాన్యం అమ్ముకోవడానికి ఈ క్రాప్, ఈ కేవైసీ తప్పనిసరి కావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ధాన్యం అమ్ముకున్న రైతులకు వెంటనే చెల్లింపులు జరిపితే చాలా మంది రైతులకు మద్దతు ధర దక్కే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలు చేసిన తరవాత నెలల తరబడి నగదు చెల్లించకుండా వేధిస్తే మాత్రం మరలా రైతులు వ్యాపారులను ఆశ్రయించి నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం లోపాలు సరిదిద్దుకొని ఈ రబీలోనైనా ధాన్యం కొనుగోలు లక్ష్యం చేరుకుంటుందా లేదా అనేది మరో నెల రోజుల్లో తేలనుంది.