‘ఖేల్‌రత్న’ రేసులో కిదాంబి, సాయి ప్రణీత్‌, హంపి

భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డుకు షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌లతో పాటు మహిళా చెస్‌ క్రీడారిణి కోనేరు హంపి పేర్లను ఆయా ఫెడరేషన్లు గురువారం ప్రతిపాదించాయి. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కాంస్య పతకం గెల్చిన సాయి ప్రణీత్‌.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా.. కిదాంబి శ్రీకాంత్‌ ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో సతమతమౌతూ.. టోక్యో బెర్త్‌ సంపాదించలేకపోయాడు. 2017లో కిదాంబి శ్రీకాంత్‌ చివరిసారిగా నాలుగు టైటిల్స్‌ సొంతం చేసుకున్నాడు. ఇక హెచ్‌ఎస్‌ ప్రణరు, ప్రణవ్‌ జెర్రీ చోప్రా, సమీర్‌ వర్మలను అర్జున అవార్డుకు, ఎస్‌ మురళీధరన్‌, పియు భాస్కర్‌లను ద్రోణాచార్య అవార్డు సిఫార్సు చేస్తున్నట్లు భారత బాడ్మింటన్‌ సమాఖ్య ఓ ప్రకటనలో తెలిపింది.

ఖేల్‌రత్నకు హంపి, అర్జునకు ఏడుగురు : ఎఐసిఎఫ్‌ ప్రతిపాదన

మహిళల ర్యాపిడ్‌ చెస్‌ ప్రపంచ ఛాంపియన్‌ కోనేరు హంపితోపాటు మరో ఏడుగురిని అర్జున అవార్డుకు ఆలిండియా ఛెస్‌ ఫెడరేషన్‌(ఎఐసిఎఫ్‌) సిఫార్సు చేసింది. 34ఏళ్ల కోనేరు హంపి మహిళల ప్రపంచ చెస్‌ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో ఉండగా.. వచ్చే ఏడాది జరిగే ఫిడే మహిళల క్యాండిటేట్స్‌ టోర్నీకి అర్హత సాధించింది. కోనేరు హంపికి అర్జున, పద్మశ్రీ అవార్డులు ఇప్పటికే వరించాయి. ఇక విదిత్‌ గుజరాతి, అథిబన్‌, సేతురామన్‌, లలిత్‌ బాబు, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్‌లను అర్జున అవార్డుకు సిఫార్సు చేసినట్లు సెక్రటరీ భగత్‌ సింగ్‌ చౌహాన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.