రఘురామకృష్ణం రాజుకు గాయాలు కాలేదు: తేల్చి చెప్పిన మెడికల్ బోర్డు..

ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోగ్య పరిస్థితిపై మెడికల్‌ బోర్డు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. శరీరంపై ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని నిర్ధారించింది. ‘రెండు పాదాలు వాచి ఉన్నాయి. అరికాళ్లలో రంగుమారి ఉంది. పైన గాయాలైనట్లు ఆధారాలు లేవు. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. నొప్పి అంటున్నందున కార్డియాలజిస్ట్‌కు చూపించాం. ఆ వైద్యులు తీవ్రమైన ఆస్వస్థత లేదన్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని నెఫ్రాలజీ, న్యూరాలజీ వైద్యులు వివరిస్తున్నారు’ అని నివేదికలో పేర్కొంది.

‘మా నాన్న హత్యకు పోలీసుల కుట్ర’

నర్సాపురం సిట్టింగ్‌ ఎంపీ అయిన తన తండ్రి రఘురామకృష్ణరాజును ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకొని హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు కుమారుడు కనుమూరు భరత్‌ ఆదివారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లాకు ఫిర్యాదు చేశారు. రెండు పేజీల లేఖతోపాటు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, పోలీసు కస్టడీలో తన తండ్రికి తగిలిన గాయాలు, శనివారం ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను జత చేశారు.

‘నా భర్తకు ఏమైనా జరిగితే సీఎందే బాధ్యత’

తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని ఎంపీ కె.రఘురామకృష్ణరాజు భార్య రమ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రికి ఆయన్ను తరలించాలని కోర్టు ఆదేశించినా, ఆయన్ను జైలుకు తీసుకెళ్లారని అక్కడ ఆయన భద్రత పట్ల తనకు భయం ఉందని చెప్పారు. ఆదివారం రాత్రి ఆయనపై జైలులో దాడి జరగొచ్చనే సమాచారం ఉందని పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజుకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు.