నరసన్నపేట నియోజకవర్గం, పోలాకి మండలం, కోడూరు గ్రామం కూటమి ప్రభుత్వంతో కోడూరు గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. కోడూరు గ్రామంలో జనసేన పార్టీ నాయకులతో కలసి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోడూరు గ్రామ సమస్యలను గత వైసీపీ ప్రభుత్వం గ్రామ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. కనీస మౌళిక సదుపాయాలను కూడా కల్పించక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామంలోని అటవీశాఖ పరిధిలో ఉన్న జీడిమామిడి తోటలో ఆక్రమణలు జరుగుతున్నాయన్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలను చేపడుతున్నారని వాటిని కూడా అరికడతామన్నారు. కోడూరులో మంచినీటి కొరత అధికంగా ఉందని, వాటర్ ట్యాంకు నిరుపయోగంగా పడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రహదారులు, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, యువతకు మైదాన సదుపాయం కూడా లేదని తెలిపారు. శ్మశాన వాటిక ఆక్రమణకు గురికావడంతో రోడ్డు సదుపాయం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతమని పేర్కొన్నారు. గ్రామసమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి గ్రామ అభివృద్ధిని చేపడతామని, కూటమి ప్రభుత్వం సహకారంతో గ్రామంలో మౌళిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment