జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 26 నుండి మార్చి 6వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘ‌నంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం 7 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రమేష్, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

26-02-2025. ధ్వజారోహణం(మేష ల‌గ్నం). పెద్దశేష వాహనం

27-02-2025 చిన్నశేష వాహనం హంస వాహనం

28-02-2025. సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

01-03-2025 కల్పవృక్ష వాహనం. సర్వభూపాల వాహనం

02-03-2025 పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

03-03-2025 హనుమంత వాహనం గజ వాహనం

04-03-2025 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

05-03-2025 రథోత్సవం అశ్వ వాహనం

06-03-2025 చక్రస్నానం ధ్వజారోహణం

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 7న మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం జరుగనుంది.

Share this content:

Post Comment