*అంతర్జాతీయ 139వ కార్మీక దినోత్సవ శుభాకాంక్షలు..
*కార్మిక హమాళీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పల నాయుడు..
ఏలూరులో 139వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డ్ లోని ఐఎఫ్టియు కార్యాలయం వద్ద, ఏలూరు వన్ టౌన్ మార్కెట్ సెంటర్ లోనూ, మెయిన్ బజార్ కన్నయ్య పార్క్ వద్ద, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో 139వ అంతర్జాతీయ శ్రామిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హమాళీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, వారి పనికి తగిన గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. కార్మికుల శ్రమ అంతులేనిది, వారి కష్టం వెలకట్టలేనిది, ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడికి, శ్రామికుడికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు కష్టపడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా, పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి మొత్తం సమాజాన్ని విముక్తి చేయడం కోసం పునరంకితం అవ్వాలని ప్రతిజ్ఞ చేశారు. కార్మికుల శ్రమశక్తే అభివృద్ధికి పునాది అన్నారు. ఏ దేశమైన ఆర్థికంగా సమున్నత స్థానంలో ఉండాలంటే అక్కడ కార్మిక శ్రమశక్తి కి గుర్తింపు ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గం మేడే జరుపుకుంటున్న ఈ సందర్భంలో, పెట్టుబడిదారీ దేశాలలో 8 గంటల పని దినంతో పాటుగా కష్టపడి సాధించుకున్న హక్కులన్నీ దాడికి గురవుతున్నాయని అన్నారు. వేతనాలు, బోనస్, పింఛన్లు కోతకు గురవుతున్నాయని, పూర్తి పెన్షన్ పొందేందుకు రిటైర్మెంట్ వయసు పెంచుతున్నారని, కార్మిక సంఘాల హక్కులపై, మరీ ముఖ్యంగా సమ్మె చేసే హక్కుపైన దాడి జరుగుతోందన్నారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయని, ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శన మన్నారు. 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా 8 గంటలు రిక్రీయేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు, హమాలీ వర్కర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment