కలెక్టర్ హామీతో ఆమరణ దీక్ష విరమించిన లక్ష్మీ

సత్తెనపల్లి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు నకరికల్లులోని ఒక రహదారి నిర్మాణానికి హామీ ఇచ్చి మాట తప్పినందుకు నిరసనగా, సదరు రోడ్డు పనులు ప్రారంభించాలంటూ గత నాలుగు రోజులుగా ఆమరణ దీక్షకు దిగిన జనసేనపార్టీ నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ ఆదివారం తన దీక్షను విరమించారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన పల్నాడు జిల్లా కలెక్టర్ ని జనసైనికులు, వీరమహిళలు కలిసి ఈ మేరకు వినతి పత్రమిచ్చి లక్ష్మీ ఆమరణ దీక్ష గురించి సమాచారమందించారు. వెంటనే ఆయన స్పందించి 15 రోజుల్లో సదరు రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చి, తక్షణమే లక్ష్మీ చేత దీక్షను విరమింపజేయాల్సిందిగా సూచించడంతో విరమించడం జరిగింది. ఈ సందర్భంగా దీక్షా శిబిరానికి వచ్చిన జనసేనపార్టీ మహిళా విభాగమైన కృష్ణా-పెన్నా జిల్లాల మహిళా వింగ్ కో-ఆర్డినేటర్ పార్వతి నాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావులు లక్ష్మీకి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ లక్ష్మీ ఒక మంచి లక్ష్యంతో చేసిన ఈ దీక్ష విజయవంతమైనందుకు ఈ కార్యక్రమంలో పాల్గొని, సంఘీభావం తెల్పిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. తనకి మద్దతునిచ్చి తనపై ఆదరాభిమానాలను చూపిన అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, సమస్య పరిష్కారానికి స్పందించి హామీనిచ్చిన కలెక్టర్ కి లక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగిశెట్టి సుమన్, తోట నర్సయ్య, నాదెండ్ల నాగేశ్వరరావు, చిలకా పూర్ణ, కడియం అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు.