వైభవంగా అంతర్వేది లక్ష్మీనర్సింహస్వామి దివ్యకళ్యాణ వేడుక

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.  భక్తుల గోవింద నామస్మరణ మధ్య కల్యాణ ఉత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

స్వామివారి కల్యాణం తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రాత్రి 11 గంటల 19 నిమిషాలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంగా మారాయి. కళ్యాణోత్సవం అనంతరం అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. శుక్రవారం నుంచి ఆలయంలో కల్యాణోత్సవాలు జరుగుతుండగా.. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అంతర్వేదిలో నూతన రథంపై స్వామి, అమ్మవార్ల రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.

ఇదిలావుంటే, సెప్టెంబర్ నెలలో షెడ్డులో భద్రపరచిన లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైంది. 60 ఏండ్ల క్రితం టేకుతో 40 అడుగుల ఎత్తున్న రథాన్ని తయారు చేయించారు. రథం దగ్ధం కావడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. రథం మంటల్లో కాలిపోవడంతో.. 2021లో అంతర్వేది రథోత్సవం.. కొత్త రథంతోనే నిర్వహిస్తామని భక్తులకు హామీ ఇచ్చారు సీఎం జగన్. చెప్పినట్లుగానే కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని నాలుగు రోజుల క్రితం రథసప్తమి రోజున పూజలు చేసి ప్రారంభించారు. ఐదు నెలల్లో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా భవ్యమైన నూతన రథం నిర్మాణం పూర్తి చేసి.. లక్ష్మీ నరసింహస్వామికి సమర్పించారు. ఇప్పుడు అంతే ఘనంగా కల్యాణోత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం.