న్యాయవాద దంపతుల హత్యల కేసు విచారణ.. మార్చి15 కు వాయిదా!

హైదరాబాద్: లాయర్ వామనరావు దంపతుల మరణ వాంగ్మూలాన్ని ఎందుకు రికార్డు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. బాధితులను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయొచ్చని, మెజిస్ట్రేట్ ని తీసుకొచ్చి వారి ముందర స్టేట్మెంట్ తీసుకునే అవకాశముంది కదా అంటూ వ్యాఖ్యానించింది. వామన్ రావు దంపతుల హత్య కేసుపై హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది.

గత నెల ఫిబ్రవరి 17వ తేదీన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద నడిరోడ్డుపై అడ్వకేట్ వామన్ రావు దంపతులను కొందరు దుండగులు నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఇప్పటి వరకు తాము జరిపిన నివేదిక ను హైకోర్టుకు సమర్పించింది పోలీస్ శాఖ. విచారణలో భాగంగా.. ఈ కేసులో ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారని , ఎంతమందిని మంథిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని హైకోర్టు ప్రశ్నించింది.

ఈ కేసుపై అడ్వకేట్ జనరల్ కోర్టుకు తన వాదనలు తెలుపుతూ . హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసు వాళ్ళు.. మొబైల్ ఫోన్స్, రక్తపు మరకలను, నిందితులు వాడిన వాహనాన్ని, వారి కాల్ డేటాను స్వాధీనం చేసుకున్నారని కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, రెండు బస్సుల డ్రైవర్లతో సహ మొత్తం ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులు గుర్తించామని తెలిపారు.

అయితే.. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీ పి సీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదని హైకోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. పోలీసు వారు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వారి స్టేట్ మెంట్ రికార్డు చేశారని, త్వరలోనే వారి స్టేట్మెంట్లను మేజిస్ట్రేట్ వద్ద రికార్డ్ చేస్తామని కోర్టుకు తెలిపారు ఏజీ. నేరస్థుల నుంచి నుంచి ఇంకా కావాల్సిన సాక్షాలు సేకరించవలసి ఉందని, కాబట్టి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద రికార్డ్ చేయలేదని కేవలం 161 స్టేట్ మెంట్ మాత్రమే నమోదు చేశామని ఆయన చెప్పారు. ఇంకా రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరగా.. ఈ కేసుపై తదుపరి విచారణను మార్చి 15 కు వాయిదా వేసింది హైకోర్టు.