ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు..!

  • ఏ.కే.యూ ఉప కులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి.
  • విద్యార్థుల్లో సేవా గుణాలు పెంపొందుతాయన్న ప్రిన్సిపాల్

జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు గణనీయంగా పెంపొందుతాయని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్ మూర్తి అన్నారు. స్థానిక ఏ.కే.యూ సమావేశపు హాలు నందు సోమవారం ఉదయం వికసిత్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా జరిగిన ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్ల సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్.ఎస్.ఎస్ సర్టిఫికేట్లు ఉన్నత చదువులకు ఎంపికలోనూ, ఉన్నత స్థాయి ఉద్యోగాల నియామకం లోనూ ఎంతగానో ఉపయోగ పడతాయని విద్యార్థులకు సూచించారు. ఉప కులపతి ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ ఏ వృత్తినైనా నిబద్ధతతో చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అందుకోసం ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధిలో భాగంగా నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వికసిత్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఇటీవల ఒంగోలు నందు ఏ.కే.యూ, ఇతర డిగ్రీ కళాశాలల ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు బాధ్యతతో పనిచేసి నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్శిటీకి మంచి పేరు, ప్రఖ్యాతులు తీసుకొని వచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితం గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడే భవిష్యత్ బంగారుమయం అవుతుందని ప్రొఫెసర్ మూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఏ.కే.యూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులలో సేవా గుణాన్ని, సేవా తత్పరతను పెంపొందించడానికి ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగ పడుతాయని అన్నారు. సమాజాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాల్సి ఉందని, నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సమాజాభివృద్ధి కోసం ప్రత్యేక క్యాంపుల ద్వారా పాటు పడుతున్న ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లకు ప్రతి ఒక్కరూ చేయూత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితురాలుగా హాజరైన వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలా మణి మాట్లాడుతూ ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాల ద్వారా జట్టు సభ్యులలో ఐకమత్యం, సోదర భావం, సేవాగుణం వంటి మంచి లక్షణాలు అలవడు తాయని ఆమె పేర్కొన్నారు. 1977లో దివిసీమ ఉప్పెన సమయంలో ప్రభుత్వం కళాశాలల తరుపున నిర్వహించిన సేవా కార్యక్రమాలలో తాను ఒక ఎన్.ఎస్.ఎస్ వాలెంటీరుగా పనిచేయడం జరిగిందని ప్రొఫెసర్ నిర్మలా మణి తన కాలేజీ చదువుల నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అనంతరం వి.సి ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలా మణి, ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ తదితరుల చేతుల మీదుగా విద్యార్థులకు ఎన్.ఎస్.ఎస్. సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్ విభాగం తరుపున సమన్వయ కర్త డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ సోషల్ వర్క్ విభాగం హెడ్ డాక్టర్ పిల్లి వెంకటరావు, ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి డాక్టర్ ఆర్ శ్రీనివాస్, ఎస్.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాల ఎస్.ఎస్.ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్ టి.రాజేంద్ర, పలు డిగ్రీ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Share this content:

Post Comment