అధికారులకు చెరువులను రక్షించే బుద్ధినివ్వండి

  • చెరువుల కబ్జాతో పర్యావరణానికి, ప్రాణకోటికి ముప్పు
  • అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు

పార్వతీపురం, పర్యావరణ పరిరక్షణకు సకల ప్రాణులకు ఆధారభూతమైన చెరువులను రక్షించే బుద్ధిని సంబంధిత శాఖల అధికారులకు ప్రసాదించాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు వంగలు నాయుడు ఉపాధ్యక్షురాలు రేజేటి దయామణి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి చెరువులు కబ్జాలను అరికట్టే బుద్ధిని సంబంధిత శాఖల అధికారులకు ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వీకులు భావితరాలకు ప్రసాదించిన చెరువులను జిల్లాలో కొంతమంది కబ్జాదారులు ఆక్రమణలు చేసి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. అటువంటివారిని సంబంధిత ఆయా శాఖలకు చెందిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అటువంటి అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి రాజ్యాంగపరంగా ఉన్న తమ బాధ్యతలను నిర్వర్తించేలా వారికి బుద్ధి ప్రసాదించాలని కోరారు. చెరువులు ను కాపాడుకుంటే సకాలంలో వర్షాలు కురవటం, సాగు, తాగునీరుతో పాటు సకల జీవరాశులకు ప్రాణాధారమైన నీటిని అందిస్తాయన్నారు. భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పర్యావరణం రక్షించబడుతుందన్నారు కాబట్టి చెరువులను పరిరక్షించే బాధ్యత కలిగిన రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, మున్సిపాలిటీ, సచివాలయ అధికారులకు, ఉద్యోగులకు వారి వారి విధులు సక్రమంగా తీసుకుంటున్న జీతానికి పనిచేసేలా ప్రభుత్వ ఆస్తులను కాపాడేలా బుద్దిని ప్రసాదించాలని కోరారు.