• ప్రజల సమస్యలు, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దాం
• చర్చల్లో మన సభ్యులు చురుగ్గా పాలుపంచుకోవాలి
• మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలి
• వైసీపీ భాష వద్దు
• జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్
‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలి. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను, ఆశలను, సంక్షేమాన్ని, చట్టసభల్లో వినిపించేలా పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. శాసనసభ సంప్రదాయాన్ని, మర్యాదను కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్దామని చెప్పారు. చట్ట సభలలో ఎంత విలువైన చర్చలు జరిగేవో ఒకసారి అందరూ పరిశీలించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకొని చర్చల్లో పాల్గోవాలని తెలిపారు. బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మొదలవుతున్న తరుణంలో జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ముందుగా పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్వాగత ఉపన్యాసం చేస్తూ.. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ విధివిధానాలు అనుసరించి చర్చల్లో బలంగా పాల్గొనాలని, పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంలో ముందుకు వెళ్లాలని సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అంకిత భావంతో పని చేస్తున్నారు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం మనందరం కట్టుబడి ఉండాలని తెలిపారు. ఆ స్ఫూర్తి మనం పాల్గొనే చర్చల్లో కనిపించాలి అన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘శాసనసభ్యులు మాట్లాడే ప్రతి పదం ఎంతో ప్రభావవంతమైనది. చట్టసభల్లో మాట్లాడే భాష విషయంలో, వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అభ్యంతరకర పదజాలం వాడవద్దు. హుందా అయిన భాష, గౌరవప్రదమైన పదాలను నాతో సహా ప్రతి ఒక్కరూ వినియోగించాలి. చట్టసభల్లో మనం మాట్లాడే ప్రతి విషయాన్ని ప్రజలంతా చూస్తున్నారని, వారి ఎదురుగా మనం మాట్లాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైసీపీ దిగజారుడు భాష వాడింది. ఆ తరహా భాష వద్దు.
• వైసీపీవి బురద రాజకీయాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో వైసీపీ ప్రజాప్రతినిధులు అప్పట్లో వాడిన భాష, వ్యవహరించిన విధానం ప్రజలంతా గమనించారు. వారు పూర్తిగా బురదలో కూరుకుపోయారు. వారి బురద మనకు అంటించాలని చూస్తారు. వారి బురద రాజకీయాలకి పడకుండా, వారు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా హుందాగా వ్యవహరించాలి. వైసీపీ ప్రజాప్రతినిధులు బూతులు, అసభ్య పదజాలంతో ఈ బడ్జెట్ సమావేశాల్లో రెచ్చగొట్టినా సంయమనం పాటించండి. వైసీపీ వాళ్లు దిగజారుడు వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారు ఏదో అన్నారని మీరు దిగజారి ఇష్టానుసారం భాషను వాడొద్దు. స్పందించే సందర్భంలో హుందాగా సమాధానం ఇవ్వండి. చట్టసభల్లో మాట్లాడే ప్రతి మాటను జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వాడాలి. మనలో ఎక్కువ మంది, నాతో సహా తొలిసారి ఎన్నికైన వారు ఉన్నారు. భాష విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో నాదెండ్ల మనోహర్ , కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్, హరిప్రసాద్ గైడ్ చేయాలి.
• సీనియర్లతో మాట్లాడండి.. ప్రతి చర్చలో పాల్గొనండి
పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుల్లో నాతో సహా చాలామంది కొత్తవారు. సభలో చేపట్టే ప్రతి చర్చ సహేతుకంగా జరగాలి. అసెంబ్లీలో ప్రతి నిమిషం చాలా విలువైంది. ప్రజలకు సంబంధించిన అంశాలను జీరో అవర్, ప్రశ్నోత్తరాల్లో లేవనెత్తండి. అలాగే ఇతర అంశాలకు సంబంధించి జరిగే చర్చల్లో చురుగ్గా పాల్గొనాలి. పార్టీలో సీనియర్ రాజకీయ నాయకులున్నారు. నాదెండ్ల మనోహర్ , కొణతాల రామకృష్ణ , మండలి బుద్ధ ప్రసాద్, కందుల దుర్గేష్ లాంటి అనుభవజ్ఞులు మనకు ఉన్నారు. ఏ అంశంలో అయినా సందేహాలు వస్తే వారితో చర్చించి, వారి సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్లండి. సభలో నడుచుకోవాల్సిన విధానం, మాట్లాడాల్సిన తీరు, సమస్యలను సభ ముందుకు తీసుకురావాల్సిన విధానం గురించి చర్చించండి. సీనియర్లతో మాట్లాడటం వల్ల సభా సంప్రదాయాలు, విలువైన సమాచారం తెలుస్తుంది. అలాగే ప్రజా సంబంధిత అంశాలపై జరిగే చర్చల్లో మాట్లాడటం కూడా ప్రధానం. సమస్యలపై సూటిగా మాట్లాడటం, సమస్యలకి పరిష్కారం చెప్పటం కూడా అవసరం.
• అధ్యయనం తప్పనిసరి
ప్రతి శాసనసభ్యుడు బడ్జెట్ ను అధ్యయనం చేయాలి. ప్రభుత్వ రాబడులు, ఖర్చులు, శాఖల వారీగా కేటాయింపులు, అప్పులు ఇతరత్ర అంశాలపై క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఒకవేళ కొత్తగా ఎన్నికైన సభ్యులకు కొన్ని విషయాల్లో సందేహాలు ఉంటే సీనియర్లను అడిగి తెలుసుకోండి. బడ్జెట్ పై జరిగే పద్దుల చర్చలో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ చర్చల్లో భాగస్వాములు కావాలి. సభ్యులు తమకి ఏయే శాఖలపై అవగాహన, ఆసక్తి ఉన్నాయో వాటి ఆధారంగా చర్చల్లో మాట్లాడాలి. సభ్యుల ఆసక్తి, అవగాహన వివరాలు విప్ లు సేకరించాలి. అలాగే నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను తెలుసుకొని రాష్ట్రవాప్తంగా ఆ తరహా సమస్యలు ఉంటే వాటినీ క్రోడీకరించి మాట్లాడండి. దానివల్ల ప్రతి సభ్యుడి గొంతు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అర్ధం అవుతుంది’’ అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాల్గొన్నారు.
Share this content:
Post Comment