తహసీల్దారు కార్యాలయం ఎదుట మదనపల్లె జనసేన నిరసన

మదనపల్లె నియోజకవర్గం చీగలబయలు పంచాయతీలో ఇదివరకు భావితరాల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన‌ ప్రభుత్వ పాఠశాల భూమిలో అక్రమంగా మదనపల్లె ఎమ్మెల్యే డ్రైవర్ ఇంటి నిర్మాణం చేపట్టిన సందర్భంగా వారిని అడ్డుకున్న చీగలబయలు సర్పంచ్ ప్రభాకర్ పై మరియు ఆ గ్రామ ప్రజలపై అక్రమ కేసు నమోదు చేయడం ఎంతవరకు సబబు అని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు దురాక్రమణలకు గురి కాకుండా కాపాడాల్సిన రెవెన్యూశాఖ అధికారులు బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.‌ చీగలబయలు సర్పంచ్ ప్రభాకర్, గ్రామస్థులపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ తహసీల్దారు కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జంగాల శివరామ్ రాయల్, జగదీష్, గ్రానైట్ బాబు, ప్రసాద్, శేఖర్, కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వ తీరుపై గంగారపు రామదాస్ చౌదరి మండిపడ్డారు. అధికార పార్టీ భూ అక్రమాలపై ఫిర్యాదులు చేస్తున్న అధికారులకు చలనం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.