మదనపల్లెను జిల్లా కేంద్రంగా విస్మరించారు: గంగారపు స్వాతి

మదనపల్లె: అన్ని హంగులు వున్న మదనపల్లెను జిల్లా చేయకుండా అన్యాయం చేశారు. అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి మదనపల్లె ప్రాధాన్యత అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయాలని మదనపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ గంగారపు స్వాతి, రామదాస్ చౌదరి కోరారు. ‌మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రెటరీ సనావుల్లా, మదనపల్లె రూరల్ అధ్యక్షుడు గ్రానైట్ బాబు, రామసముద్రం అధ్యక్షుడు చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి, ఐటీ విభాగం జగదీశ్, ప్రసాద్ బంగారం, కుమార స్వామి, అర్జున్, వీర మహిళలు రెడ్డెమ్మ, టైగర్ పద్దు, నాగవేణి, రేణుకతో పాటు జనసైనికులు పాల్గొన్నారు.‌ ఈ సందర్భంగా గంగారపు స్వాతి మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లెలో సమస్యలు తిష్ట వేశాయాని అన్నారు. ‌బ్రిటిష్ పాలన లో కడప జిల్లా గా ఉన్నపుడు కూడ మదనపల్లె కేంద్రంగా పరిపాలన సాగిందనే విషయాన్ని గుర్తు చేసారు. ‌బిటి కళాశాల, అహ్లాదకరమైన వాతావరణం, పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్, జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన పాఠశాల, టమోటా మార్కెట్ దేశానికే తలమానికం అన్నారు.‌ ఇలాంటి ఎన్నో ప్రధాన అంశాలు కలిగిన మదనపల్లెను జిల్లా కేంద్రం చేసి వుంటే మరింత అభివృద్ధి జరిగి వుండేదని అన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య అధికంగా వుందని దానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ‌ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ మదనపల్లె ప్రాంతంలో అభివృద్ధి పడకేసిందన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేయాలని, బిటి కళాశాల అభివృద్ధి చేసి యూనివర్సిటీ స్థాయికి పెంచాలని, ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మంచి వైద్యం అందించాలని, గుంతలు పడిన రోడ్ల మరమ్మత్తులు, ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలని కోరారు. చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర మాట్లాడుతూ చేనేతల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా చేనేతలకు సంక్షేమ పధకాలు అమలు చేయాలని, గృహనిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. సనావుల్లా మాట్లాడుతూ రామసముద్రం మదనపల్లె రోడ్డు అభివృద్ధి చేయాలని, గతంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇచ్చిన హామీ అమలు చేసి ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్డు నిర్మించాలని కోరారు.