కోనసీమ జిల్లా, అమలాపురం, రవణం వీధి శివాలయం రోడ్ లో ఉన్న శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర ప్రసన్నాంజనేయ షిరిడి సాయి స్వామి వార్ల ఆలయంలో మహా శివరాత్రి మహోత్సవములు అను వంశిక ధర్మ కర్త, ఆలయ చైర్మన్ మాచిరాజు రవి కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర బహుళ త్రయోదశి 26వ తేదీ బుధవారం త్రయోదశి మహా పర్వదినమున శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవములు అత్యంత వైభవముగా జరుపబడును. మహోత్సవాల్లో బ్రహ్మ ముహూర్తకాలము లగాయతు (ఉదయం 4 గంటల నుండి) లింగోద్భవ కాలము వరకు (రాత్రి 12 గంటల వరకు) స్వామి వారికి అభిషేకములు, సాయంత్రం 6 గంటల నుండి అఖండ దీపారాధన మహోత్సవం, రాత్రి 7 గంటలకు సత్యసాయి సేవా సమితి అమలాపురం వారిచే భజనా కార్యక్రమం జరుగును. అనాతవరం గ్రామ వాస్తవ్యులు శైవాగమ విశారద బ్రహ్మశ్రీ వెలవలపల్లి సోమేశ్వరశర్మ వారి ఆధ్వర్యంలో రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు లింగోద్భవ కాలమున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు. ఉదయం గుడివాడ రామారావు (రాంబాబు) చే ప్రసాద వితరణ. ఈ మహాశివరాత్రి మరియు త్రయోదశి మహా పర్వదినమున ఆ పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన అభిషేకములలో పాల్గొను భక్తులు స్వయంగాని, వారి గోత్ర నామములతో గాని, ముందుగా రూ. 100/- చెల్లించి రశీదు పొందినచో బ్రహ్మముహూర్తమున అభిషేకము, ఉదయం అభిషేకము (స్వయంగా) లింగోద్భవ కాములన ఏకాదశ రుద్రాభిషేకములు వారి గోత్ర నామములతో జరిపించబడును. సాయంత్రం దీపారాధన ఉత్సవములో స్వయముగా పాల్గొనవచ్చును. కావున యావన్మంది భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలి అని మాచిరాజు రవికుమార్, ఛైర్మన్ వంశ పారంపర్య ధర్మకర్త మరియు కమిటీ సభ్యులు తెలిపారని ఆలయ పి ఆర్ ఓ గారపాటి పండుబాబు తెలిపారు.
Share this content:
Post Comment