గుణశేఖర్ ‘ప్రతాపరుద్రుడు’గా మహేశ్ బాబు?

గుణశేఖర్ ఇక భారీ చారిత్రక .. పౌరాణిక చిత్రాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ‘రుద్రమదేవి’ తరువాత ఆయన ‘ప్రతాపరుద్రుడు’ సినిమాను రూపొందించాలని అనుకున్నారు. కానీ ముందుగా ‘హిరణ్యకశిప’ సినిమా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తరువాత, కొన్ని కారణాల వలన ఆయన ‘శాకుంతలం’ను పట్టాలెక్కించారు. సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా 50 శాతం పూర్తయింది.

ఈ సినిమా తరువాత ఆయన ‘హిరణ్యకశిప’ చేయాలనే నిర్ణయంతోనే ఉన్నారు. అన్నీ సిద్ధంగానే ఉండటం వలన ఆ సినిమా చకచకా పూర్తవుతుందనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ తరువాత ప్రాజెక్టుగా ‘ప్రతాపరుద్రుడు’ ఉండనుంది. లాక్ డౌన్ సమయంలో ఈ కథపై ఆయన పూర్తిస్థాయి కసరత్తు చేశారట. ఈ కథకి మహేశ్ బాబు అయితే బాగుంటాడనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని చెబుతున్నారు. ‘ఒక్కడు’ సినిమా నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే చారిత్రకాలు .. పౌరాణికాలపై పెద్దగా ఆసక్తిని చూపని మహేశ్ బాబు, ఈ ప్రాజెక్టును ఒప్పుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారనుంది.